ప్రతి బిజెపి ఎంపీ 150కి.మీ పాదయాత్ర చేయాలి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బిజెపి పార్లమెంటు సభ్యులు ఒక్కొక్కరు 150కి.మీ పాదయాత్ర చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఎంపీలను కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

గాంధీ జయంతి అయిన అక్టోబర్‌ 2 నుంచి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ జయంతి అయిన అక్టోబర్‌ 31 మధ్య ఒక్కో రోజు 15కి.మీ చొప్పున మొత్తం 150 కి.మీ పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యులు బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలని కోరారు.

పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని మోదీ ఆదేశించినట్లు జోషి తెలిపారు. అలాగే గ్రామాల పునరుజ్జీవం, స్వయం సమృద్ధిపై దృష్టి సారించేలా యాత్ర కార్యాచరణని రూపొందించనున్నామని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్ర కొనసాగతుందని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సందర్భంగా గాంధీకి గొప్ప నివాళిగా వికిపీడియా తరహాలో గాంధీపీడియా రూపొందించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.