ఉద్యోగుల బదిలీలలో వత్తిడులు, వేధింపులు

పారదర్శకంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించని రీతిలో, వారి ఇష్టం మేరకు బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినప్పటికీ వత్తిడులు, వేధింపులు చోటుచేసుకోవడంతో బదిలీల ప్రక్రియపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల బదిలీలు ఈ నెల 10వ తేదీతో ముగియనుండటంతో పైరవీలు జోరందుకున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. 

గత ఐదేళ్లలో టీడీపీ నేతలు తమకు అనుకూలమైన వారిని నియమించుకుని, పనులు చక్కబెట్టుకున్నారని వైసిపి  నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చామని, తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగులను నియమించుకుంటే తప్పేమిటనే ప్రశ్నిస్తున్నారు. దీంతో తమకు అనుకూలురైన అధికారులు, సిబ్బందిని నియమించుకునేందుకు వీలుగా జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇది జిల్లా అధికారులకు తలనెప్పిగా పరిణమిస్తోంది. 

టీటీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు, ఫోకల్ పాయింట్ల నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు, కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాలకు బదిలీ చేయిస్తుండటంతో కొందరు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోటీ చేసి ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా సిఫారసు లేఖలు ఇవ్వడం గమనార్హం. 

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల బదిలీ విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగ సంఘాల నేతలుగా వ్యవహరిస్తున్న వారు బదిలీల నుంచి మినహాయింపులు పొందేందుకు పైరవీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు టెర్మ్‌లు, లేదా 9 సంవత్సరాలు ఒకచోట ఉద్యోగ సంఘాల నేతలు పనిచేస్తే వారిని బదిలీ చేయాల్సి ఉన్నా, ఒత్తిళ్ల మేరకు వారికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖలో పనిచేస్తున్న ఒక రిజస్ట్రార్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ)కే తాను కోరిన చోటుకు బదిలీ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం బదిలీల్లో చోటుచేసుకునే తెరవెనుక వ్యవహారాల్ని చెప్పకనే చెబుతున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా, వేధింపులు లేకుండా చూడాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.