చమురు ధరలకు నిరసనగా ప్రతిపక్షాల ‘భారత్‌ బంద్‌’

రికార్డు స్థాయిలో పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన ‘భారత్‌ బంద్‌’ సోమవారం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ బంద్‌ కొనసాగుతోంది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ధరల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. బిహార్‌ రాజధాని పట్నాలో ఎల్‌జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్‌పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గుజరాత్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ధరల పెంపునకు నిరసనగా రోడ్లపైకి చేరిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సులను అడ్డుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బంద్‌ నేపథ్యంలో ముంబయి లోకల్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కార్యకర్తలు పెట్రోల్‌ బంక్‌ల వద్దకు వెళ్లి వాటిని మూయించారు. మరోవైపు బంద్‌ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా భారత్‌ బంద్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్‌) సహా 21 విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. అయితే తెలుగు రాష్త్రాలలో బంద్ కు పాక్షిక మద్దతే లభిస్తున్నది.