కర్ణాటక బిజెపి చెంత ‘మ్యాజిక్‌ ఫిగర్‌’

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ ను బిజెపి వ్యూహాత్మకంగా చేచిక్కించుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కాకుండా అధికార కూటమిలోని అసంతృప్తిగా ఉన్న నేతలు వరుసగా శాసన సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ ఉండడంతో తనకున్న సొంత బలంతోనే మెజారిటీ నిరూపించునేకుందుకు బీజేపీకి అవకాశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

తొలుత కాంగ్రెస్‌కు చెందిన 21 మంది మంత్రులు రాజీనామా చేయగా.. జేడీఎస్‌ మంత్రులు కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు కర్ణాటక సీఎంఓ కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది.

14 మంది శాసన సభ్యుల రాజీనామాలపై శుక్రవారం నాడు ఎలాంటి నిర్ణయం తీసుకోని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ మంగళవారం తాను ఆఫీసుకు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తానని చెప్పారు. వారి రాజీనామాలు నిర్ణీత ఫార్మైట్‌లో వాటిని ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో గత్యంతరం ఉండదు.

ఒకవేళ 14 మంది రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించినట్లయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య మొత్తం 110. అవుతుంది. అప్పుడు జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 104కు పడిపోతుంది. బీజేపీకి 105 స్థానాలు ఉన్నాయి కనుక ఇంకా ఒక్కరి మద్దతు అవసరం అవుతుంది.ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి.. బీజేపీకి అండగా నిలబడేందుకు సై అన్నారు. దీంతో బీజేపీ గుప్పిట్లోకి ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ వచ్చినట్టయింది. తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి.. ముంబైలోని రెబెల్‌ ఎమ్మెల్యేల క్యాంపునకు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ చేరుకున్నారు.

అయితే, చేజారిన ఎమ్మెల్యేలను ‘మంత్రి పదవి అస్త్రం’తో తిరిగి దక్కించుకోవాలని సంకీర్ణ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. బీజేపీకి ఏకైక బీఎస్పీ సభ్యుడు కూడా మద్దతు ఇవ్వడానికి గానీ, బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఈ

ఈ నేపథ్యంలోనే కుమారస్వామి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే, గవర్నర్‌ ఆయనను బలపరీక్షకు సిద్ధపడేలా ఆదేశించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సంకీర్ణ నేతలు కొత్త వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చి ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. మంత్రి పదవుల గాలానికి రెబెల్‌ ఎమ్మెల్యేలు దిగివస్తారని, సాయంత్రానికి రెబెల్‌ క్యాంపులోని ఐదారుగురు ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకుంటారని కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు చెప్తున్నారు.