కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు 21మంది రాజీనామా !

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా రాజీనామా చేస్తుండటంతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకరమైనది. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు 21 మంది కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ.. మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలన్న వారి కోరిక నెరవేరబోతోందని తెలిపారు.

మరోవంక,  రాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ‘కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నా మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీని మీరు(గవర్నర్‌) ఆహ్వానిస్తే ఆ పార్టీకి నేను మద్దతిస్తాను’ అని నగేశ్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాజీనామా అనంతరం నగేశ్‌ ఇప్పటికే ముంబయి చేరుకొని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జత కూడారు. అటు మరో మంత్రి, బీదర్‌ నార్త్‌ ఎమ్మెల్యే రహీమ్‌ ఖాన్‌ కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి సమాచారమిచ్చానని తెలిపారు. 

సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 13 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిని బుజ్జగించేందుకు జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసమ్మతి నేతలకు కేబినెట్‌లో స్థానం కల్పించాలని చూస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ మంత్రులు త్యాగానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే ఈ మంత్రులంతా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామాలను సమర్పించారు. అయితే.. జేడీఎస్‌కు చెందిన మంత్రులు కూడా ఇదే బాటలో పయనిస్తారా లేక మంత్రులుగానే కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది.