విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికు బిజెపి డిమాండ్

విశాఖలో భూ కుంభకోణాలపై విచారణ జరిపి ఇచ్చిన సిట్ నివేదికను బయటపెట్టాలని బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. తాను టీడీపీ, బీజేపీ పొత్తుతో ఉన్నప్పుడే విశాఖలోని భూకుంభకోణాన్ని బయటకు తీశానని చెప్పారు. ఆ సిట్ నివేదికలో అన్ని పసుపు చొక్కా పాములు ఉండటం వల్లనే గత ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టలేదని విమర్శించారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అవినీతిని అంతమొందిస్తామని చెబుతున్నారని, అందువల్లనే అవినీతిని అంతమొందించేందుకు విశాఖలో భూ కుంభకోణంపై జరిపిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలని తాను డిమాండ్ చేశానని తెలిపారు.

కేవలం రాజధానిలో ప్రజావేదికను కూల్చినంత మాత్రాన ప్రజలకు మంచి సందేశం వెళుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. గత అసెంబ్లీలో అత్యధిక గంటలు సమస్యలపై ప్రస్తావించినది తానేనని గుర్తు చేశారు. తాను ప్రస్తావించిన సమస్యలపై గత ప్రభుత్వం స్పందించి సిట్‌ను వేసినప్పటికీ ఆ నివేదికను గోప్యంగా ఉంచారని ధ్వజమెత్తారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో నేటికీ ఇసుక దోపిడీ ఆగలేదని రాజు ఆరోపించారు. కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని కొనసాగిస్తూ ఇసుక దోపిడీని అరికట్టమని తాను కోరానని చెప్పారు. కాగా, కొత్త పాలసీని అమలు చేస్తామని ఇప్పుడు ఇసుక దొరకకుండా చేశారని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని, వాటిపై ఆధారపడిన కూలీలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.