తెలంగాణ నేతలకు అమిత్‌షా భరోసా

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరుండి పార్టీని గెలిపిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ నేతలతో గత రాత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహం గురించి సమాలోచనలు జరిపారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, గెలుపు గుర్రాలను సిద్ధం చేయాలని సూచిస్తూ జాతీయ పార్టీ వారికి అండగా ఉంటుందని రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. పొత్తుల గురించి ఆలోచన లేకుండా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు స్పష్టంచేసారు.

‘తెలంగాణ ఎన్నికల్లో పార్టీ జాతీయ కార్యవర్గం వెన్నంటి ఉంటుంది. మీ విధులు మీరు నిర్వర్తించండి. మేం చేయాల్సిందంతా చేస్తాం. పార్టీ విజయం కోసం అన్ని రాష్ట్రాల నుంచి బాధ్యులు తెలంగాణకు రప్పిస్తాం. నేను దగ్గరుండి తెలంగాణలో పార్టీని గెలిపిస్తా’ అని  అమిత్‌షా స్పష్టం చేశారు.

ఈ భేటిలో పార్టీ రాష్ట్ర అద్యక్షుడు డా. కే లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు, బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి, సంఘటన ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కార్యాచరణ రూపొందించాలని సూచిస్తూ దీనికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజింగ్‌) సంతోష్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌లు రాష్ట్ర పార్టీకి అండగా ఉంటారని అమిత్ షా  తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను ప్రచారానికి పంపుతామని, రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే ఏయే ప్రాంతాల్లో సభలకు రావాలో నిర్ణయిస్తే వస్తానని లక్ష్మణ్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ఈ నెల 15న పాలమూరు బహిరంగ సభలో ఎన్నికల శంఖారావం పురించానున్న అమిత్ షా,  అనంతరం రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు ప్రణాళిక, ప్రచార, ఇతరత్రా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఏయే ప్రాంతాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు ఉండాలి, ఆయా తేదీల ఖరారును అమిత్‌షా చేయనున్నారు.

కాగా, కుటుంబ పాలన అంతమొందించడం, అవినీతి రహిత పాలన అందించడం అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్తామని డా. లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేస్తూ ఎన్నికలు నాలుగు రాష్ట్రాలతో వచ్చినా, తర్వాత వచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్‌షా సూచించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రచారం ముమ్మరం చేస్తామని, టికెట్ల కేటాయింపులో తొందరపడాల్సిందేమీ లేదని లక్ష్మణ్‌ తెలిపారు.