స్పీకర్‌ పోడియంలోకి వస్తే నాయకులు కాలేరు

‘స్పీకర్‌ పోడియంలోకి వస్తే నాయకులు కాలేరు. లోక్‌సభలో కూడా ఇదే విషయాన్ని చెప్పాం. సభ్యుడు సభలో మాట్లాడితేనే, ప్రజలు ఇష్టపడుతారు’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓమ్ బిర్లా హితవు చెప్పారు. సభలో అనుసరించాల్సిన విధానాలపై రాజస్థాన్‌ ఎమ్మెల్యేలకు నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  స్పీకర్‌ పోడియంలోకి సభ్యులు దూసుకెళ్లే పద్ధతి మంచిది కాదని, సభను వాయిదా వేయడానికి ఇది కారణమవుతుందని ఆయన చెప్పారు. 

‘లోక్‌సభ సజావుగా సాగితేనే, రాష్ట్రాల శాసనసభలు కూడా ఆ విధానాన్ని అనుసరిస్తాయి’ అని పేర్కొన్నారు. సభలోని సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. సుదీర్ఘ అసెంబ్లీ సమావేశాలు, సభలో ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలు, వేసే ప్రశ్నలు ప్రభుత్వాన్ని మరింత బాధ్యతగా పనిచేసేలా చేస్తాయని తెలిపారు. 

పార్టీలకు అతీతంగా అన్ని విషయాలపై సభలో చర్చించాలని సభ్యులకు ఓమ్ బిర్లా సూచించారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి అసెంబ్లీలో ఓ సభ్యుడు ఎక్కువ ప్రశ్నలు వేస్తే, ఆ శాఖకు సంబంధించిన మంత్రి తన శాఖపై మరింత దృష్టిపెట్టే వీలు కలుగుతుందని స్పీకర్‌ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు సుదీర్ఘకాలం కొనసాగాలని, అలా జరిగితే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని సూచించారు.   

పార్లమెంట్‌ విధానాలను శాసనసభ సభ్యులు నేర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సభ్యులకు పార్లమెంట్‌ నిబంధనలు తెలుస్తాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు. రాజస్థాన్‌ అసెంబ్లీకి సంబంధించిన కొత్త వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను బిర్లా ఆవిష్కరించారు.