బీజేపీలో చేరిన హర్యానా గాయని సప్నా చౌదరి

హర్యానాకు చెందిన గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరి బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. బిజెపి ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాని, ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనోజ్ తివారి తనకు స్నేహితుడని చెప్పారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీ పాలన నచ్చి పార్టీలో చేరానని ఆమె తెలిపారు. బీజేపీ గొప్ప పార్టీ అని.. అందుకే సభ్యత్వం తీసుకున్నానని సప్నా చౌదరి చెప్పారు.

సప్నా చౌదరి ఎన్నికల ముందు రాహుల్ గాంధీని కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారని గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో కొన్ని ఫొటోలు కూడా విడుదయ్యాయి. అయితే సప్నా చౌదరి స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని స్పష్టం చేశారు.

తరువాత ఆమె బీజేపీ నేత మనోజ్ తివారీని కలుసుకున్న ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. కాగా సప్నాచౌదరి బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేయడంతో పాటు బిగ్‌బాస్‌లో కనిపించారు.