రాజీనామాలకు మరో 10 మంది కర్ణాటక ఎమ్యెల్యేల సిద్ధం !

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు శనివారం రాజీనామాలు సమర్పించడంతో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో పది మంది శాసనసభ్యులు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కలకలం రేకేత్తిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే అటు జనతాదళ్‌ నేత దేవెగౌడ తమ పార్టీ నేతలతో విస్త్రృత స్థాయి చర్చలు జరపుతున్నారు.

మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి ఆదివారం సాయంత్రం బెంగళూరు చేరుకోనున్నారు. రాగానే సాయంత్రం జేడీఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ నేత డి.కె శివకుమార్‌, జేడీఎస్ నేత దేవెగౌడ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపైనా జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడతో కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి.

రెబెల్‌ ఎమ్మెల్యేల వెనుక కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు కొందరు ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బసచేసిన ముంబైలోని సోఫిటెల్‌ వద్ద యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యేల రాజీనామాలపై పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు.

అలాగే బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందిస్తూ ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి అందిరికీ తెలిసిందే. నేను తుమకూరు వెళుతున్నాను. తిరిగి సాయంత్రం 4గంటలకు వస్తాను. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సిద్ధరామయ్య, కుమారస్వామి చేసే ఆరోపణలపై నేను ఇప్పుడు ఏమీ స్పందించను’’ అని మీడియాతో చెప్పారు. 

కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత రామలింగారెడ్డి సైతం రాజీనామాకు సిద్ధపడడాన్ని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి బెంగళూరులో కాంగ్రెస్‌కు దన్నుగా ఉన్న రామలింగారెడ్డి సైతం రాజీనామా చేయడం విచారకరం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన అభ్యంతరాలు ఏమిటో చూడాలి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.

మరోవైపు రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తాను కేవలం ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. 46 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తన ఎదుగుదలకు పార్టీ ఎంతో దోహదం చేసిందని చెబుతూ ఈరోజు వరకు తాను ఇంకా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

మరోవంక, కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఖర్గేకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వం నిలబడుతుందని అభిప్రాయపడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ‘‘ఆ విషయాలన్నీ నాకు తెలియదు. నేను సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు సామరస్యపూర్వకంగా తొలగిపోవాలని కోరకుంటున్నాను. ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా విభజన తేవడం కోసం చేసే ప్రయత్నాలు’’ అని తెలిపారు.