తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగరేద్దాం

తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ రాబోయే ప్రభుత్వాలు మనవే కావాలని, అందరూ గట్టిగా సంకల్పిస్తే ఇది సాధ్యమేనని చెప్పారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో సాధించిన 4 స్థానాలే పునాదిగా.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేంత వరకూ విశ్రమించరాదని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమం, కోర్‌కమిటీ సమావేశాల్లో అమిత్‌షా మాట్లాడారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపుబాట పట్టాలి. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా భవిష్యత్తులో అవతరించడం ఖాయం. బిజెపికి మణిపూర్‌లో 1.43 శాతం, అసోంలో 4.5 శాతం ఓట్లే ఉండేవి. ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. పశ్చిమబెంగాల్‌లో ఓట్ల శాతాన్ని 4 నుంచి 40కి పెంచుకున్నాం" అని గుర్తు చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి 20 శాతం ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, మూడింట రెండొంతులు మెజార్టీ (80 సీట్లు) సాధించి, తెలంగాణలో పాగా వేయాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణలో సభ్యత్వం 20 లక్షలు చేయాలని ఆదేశిస్తూ " మీవల్ల కాకపోతే చెప్పండి.. నేనే వచ్చి ప్రతి జిల్లా కేంద్రంలో సమావేశం పెడతా. కొత్త సభ్యులను పార్టీలో చేరుస్తా" అని పేర్కొన్నారు.

కేసీఆర్‌తో ఎలాంటి దోస్తీ లేదని స్పష్టం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై కేసులు వేయాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నెలకోసారి రాష్ట్రానికి వస్తానని చెప్పారు. 19% ఓట్లు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారు.

నిజాం చేతుల్లోనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ నిజమైన అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలిపోయిందని చెబుతూ అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని అమిత్ షా ప్రకటించారు.

తెలంగాణలో బీజేపీని బలపర్చేందుకు ప్రజాసమస్యలపై వీధి పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు. ఏదో చేస్తున్నట్లు నటించొద్దని హెచ్చరిస్తూనే.. పశ్చిమబెంగాల్‌లో పార్టీ బలపడిన తీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, రాష్ట్రంలోనూ ఆ పార్టీ బలహీనంగా మారుతోందని తెలిపారు. తెలుగుదేశానిదీ ఇదే పరిస్థితి. తెలంగాణలో తెరాసకు మనమే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు.