వేగంగా అడుగులు వేస్తున్న ఎన్నికల కమీషన్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు సమయం నుండి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వేగంగా అడుగులు వేస్తున్నది.  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయిలో అన్నీ చక్కబెడుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నవంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు రూ.308 కోట్ల బడ్జెట్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. మరో వారంలో రాష్ర్టానికి కొత్తగా 44వేల వీవీప్యాట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లు, 52 వేల బ్యాలెట్ యూనిట్లు వస్తున్నాయని చెప్పారు. వీవీప్యాట్లు ఎలా పనిచేస్తాయి? ఓటు వేసినప్పుడు రసీదు ఎలా వస్తుంది? అనే అంశాలపై వివిధ రాజకీయ పక్షాలకు వివరించి చెప్తామని తెలిపారు. ఓటరు జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సోమవారం విడుదల చేస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి వస్తున్నట్టు రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వెంటనే ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా? అనే విషయాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తుందని చెప్పారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఉండే ప్రతినిధి బృందం. గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలతో మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు భేటీ కానున్నది. అదే రోజు రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అవుతుంది.

బుధవారం ఉదయంనుంచి సాయంత్రంవరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర బృందం సమావేశాలు నిర్వహిస్తుంది. అనంతరం సాయంత్రం 4.30 సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో వారు ప్రత్యేకంగా సమావేశమవుతారు. రెండ్రోజుల సమావేశాల ఆధారంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతినిధి బృందం నివేదిక అందజేస్తుంది.  దాని ఆధారంగా సీఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. మరోవంక, రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారులతో సమాలోచనలు జరపడం కోసం సోమవారం ఢిల్లీ వెళ్లారు.

కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారు.  దాదాపు 650 మంది ఆర్వోలకు నాలుగు రోజుల్లోనే శిక్షణ పూర్తిచేస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా, తెలంగాణలో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని భావిస్తున్నారు.

రాష్ట్రంలో 32,573 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీకి ప్రతిపాదనలు చేసింది. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కు దాదాపు ఐదుగురు సిబ్బంది అవసరమవుతారు. ఈలెక్కన మొత్తం 32,573 కేంద్రాలకు 1.62 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారు. అలాగే ఈవీఎంల నిర్వహణ, ఓట్ల లెక్కింపునకు మరో 1.90లక్షలమంది సిబ్బంది అవసరమని ఎన్నికల సంఘం అంచనావేస్తున్నది.

ఇలా ఉండగా, 2018 డిసెంబర్ 31నాటికి వరుసగా మూడేండ్లు ఒకేచోట పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను గుర్తించి, బదిలీచేసేందుకు ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. ఈ మేరకు వారి వివరాలను సేకరిస్తున్నది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేలా సొంత జిల్లాల్లో ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదని, వారందరినీ గుర్తించి బదిలీలు చేయాలని నిర్ణయించింది. సీఈవో ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు సిబ్బంది జాబితాను తయారుచేస్తున్నారు. వివిధశాఖల అధికారులతోపాటు పోలీసు అధికారులను కూడా బదిలీ చేయనున్నారు.