‘5 ట్రిలియన్‌ డాలర్ల’ లక్ష్యాన్ని విమర్శించే ‘నిత్య నిరాశావాదులు’

వచ్చే ఐదేండ్లలో దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని విమర్శిస్తున్న వారు ‘నిత్య నిరాశావాదులు’ అని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఇటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నవభారత్‌వైపు దేశం దౌడుతీసేందుకు సిద్ధం గా ఉన్నదని చెప్పారు.‘‘అలాంటివారికి సామాన్య మానవులతో సంబంధాలు ఉండవు. ఏదైనా సమస్యను సామాన్యుని ముందు ఉంచితే అతడు దానికి పరిష్కారం చూపిస్తాడు. అదే ఓ పరిష్కారమార్గాన్ని నిరాశావాది ముందు పెడితే దాన్ని అతడు సమస్యగా మారుస్తాడు’’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా శనివారం తన సొంత నియోజకవర్గం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. దేశ సమగ్రతకు ముఖర్జీ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన గొప్ప విద్యావేత్త అని కొనియాడుతూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతూ.. తలసరి ఆదాయం, వినియోగం, ఉత్పత్తి పెంపుతో వచ్చే ఐదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రోడ్‌మ్యాప్‌ వేసినట్లు తెలిపారు. 

‘కేకు పెద్దగా ఉంటేనే ప్రజలకు పెద్దపెద్ద ముక్కలు వస్తాయి. అందుకే ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పెద్ద ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రజల శ్రేయస్సుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని ప్రధాని వివరించారు. తలసరి ఆదాయం పెంపు ద్వారా పలు ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాలు ‘అభివృద్ధి చెందిన’ దేశాలుగా మారాయని ఉదహరించారు. భారత్‌ కూడా దీన్ని సాధించగలదని, లక్ష్యం కష్టసాధ్యం కాదని చెప్పారు. 

వ్యవసాయం, మత్య్స ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం, వచ్చే ఐడేండ్లలో రోడ్డు, పోర్టులు తదితర రంగాల్లో మౌలిక వసతులకు 100 లక్షల కోట్ల పెట్టుబడులు, అందరికీ ఇండ్లు, దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించినట్లు వివరించారు.ప్రభుత్వ చర్యల ద్వారా ఉద్యోగిత రేటు పెరుగుతుందన్నారు. 

కాగా, వారణాసి విమానాశ్రయంలో మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా,లాల్‌బహదూర్‌ శాస్త్రి కుమారులు అనిల్‌ శాస్త్రి, సునిల్‌ శాస్త్రి కూడా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు.

దేశం నవభారత్‌వైపు పరుగుతీసేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సవాళ్లు పలు అవకాశాలనూ కల్పిస్తాయని, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే భరతమాతకు ఇచ్చే నిజమైన బహుమతని సూచించారు. ఆయన పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తూ అన్ని వర్గాల ప్రజలకు కాషాయపార్టీ చేరువవుతుందన్నారు. ‘కలిసి రండి.. దేశాన్ని నిర్మిద్దామని మేం చెబుతాం. కలిసి రండి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని ఎన్నటికీ చెప్పం. ఇదే బీజేపీకి ఇతరులకు తేడా’ అని ప్రధాని వివరించారు.  

ఇలా ఉండగా, బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో శనివారం ఆవిష్కరించారు. 17.5 మీటర్ల ఎత్తైన ముఖర్జీ విగ్రహాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ఆవిష్కరించారు. జమ్ముకశ్మీర్‌లో ముఖర్జీ విగ్రహం ఆవిష్కరించడం ఇదే తొలిసారి.