గిరిజన మహిళ ఇంటికెళ్ళి సభ్యత్వం అందించిన అమిత్‌షా

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్‌ చేరుకున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పహాడీ షరిఫ్‌లోని రంగనాయకుల తండాలో నివసిస్తున్న సోనీబాయికి సభ్యత్వ పత్రాన్ని అందజేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అమిత్‌షా స్వయంగా సోనీబాయి నివాసానికి చేరుకున్నారు.  అమిత్‌షా రాక నేపథ్యంలో సోనీబాయి ఆయన కోసం జొన్నరొట్టె, పప్పు, ఉప్మా తదితర వంటకాలను తయారు చేశారు. వాటిని అమిత్‌షా ఆరగించి టీ తాగారని సోనీబాయి చెప్పారు. 

ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ ఓ వినతపత్రం అందజేసినట్లు వివరించారు. బీజేపీలో ఆమె  కొంతకాలంగా క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 

శంషాబాద్‌లోని కేఎల్‌ సీసీ హాలులో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటూ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే బీజేపీ రావాలని స్పష్టం చేశారు. తెలంగాణ సహా, ఏపీ, కేరళలోనూ బలపడతామని ధీమా వ్యక్తంచేశారు.

‘‘బిజెపి అఖండ విజయం తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చా. తెలంగాణలోనూ త్వరలో బీజేపీ జెండా ఎగురవేస్తాం. అదే మా ధ్యేయం.  తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడాలంటే బిజెపి గెలవాలి. మొన్నటి ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా భవిష్యత్‌లో అవతరించడం ఖాయం. ఆ దిశగా తెలంగాణ నేతలు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేస్తున్నా’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తులు, కుటుంబాలపై ఆధారపడి నడుస్తోందని విమర్శించారు. బీజేపీకి కార్యకర్తలే బలమని చెబుతూ దేశంలో రాజకీయ పార్టీలన్నింటికంటే బీజేపీ భిన్నమైన పార్టీ అని అమిత్ షా చెప్పారు. "బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు. కుటుంబ పాలన లేదు. మేం విజయానికి పొంగిపోలేదు. ఓటమికి కుంగిపోలేదు. ఆ పార్టీ ఓటమిని తట్టుకోలేకపోతోంది" అని ఎద్దేవా చేశారు.  

బీజేపీలో మాజీ సీఎం నాదెండ్ల 

 మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన  పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు షా నాదెండ్లతో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

అమిత్‌ షా సమక్షంలో బిజెపిలో చేరిన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్‌,  రామగుండం డిప్యూటీ మేయర్‌ ఎం సత్యప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం తెదేపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్‌, సిద్ధా వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రవదన్‌, మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.