ప్రమాదం అంచున కర్ణాటక సంకీర్ణం... రాజీనామాలతో 11 మంది

కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ రాజీనామా చేయగా.. తాజాగా మరో 11 మంది శాసనసభ సభ్యులు అదే బాట పట్టారు. దీంతో 13 నెలల కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదం అంచున నిలిచింది.

ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లి తదితరులు ఎనిమిది మంది తమ రాజీనామా పత్రాలతో స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్‌ అందుబాటులో లేరు. ఆయన వచ్చిన తర్వాత ఏ క్షణమైనా వీరు రాజీనామాలు సమర్పించే అవకాశముంది.

అయితే వీరి రాకగురించి తెలియని స్పీకర్ కె ఆర్ రమేష్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న ఒక బంధువుని పరామర్శించడానికి వెళ్లిన్నట్లు చెప్పారు. తాను మంగళవారం గాని కార్యాలయానికి రాలేనని తెలిపారు. దానితో అప్పటి వరకు వీరి రాజీనామాల విషయంపై నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు.

ఇటీవల ఆనంద్‌ సింగ్‌ రాజీనామా చేసిన రోజే రమేశ్‌ జక్కహళ్లి కూడా తన రాజీనామా పత్రాన్ని ఫాక్స్‌లో పంపారు. అయితే ఆ రాజీనామాను స్పీకర్‌ ఆమోదించలేదు. ఇప్పుడు రమేశ్‌ స్వయంగా రాజీనామా పట్టుకుని రమేశ్‌ స్పీకర్‌ కార్యాలయానికి రావడం గమనార్హం. ఆయనతో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. వారికి నచ్చచెప్పడం కోసం మంత్రి డీకే శివకుమార్ హుటాహుటిన స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లారు. 

కర్ణాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బిజెపి  104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 సీట్లలో గెలిచింది. కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113. అయితే ఆనంద్‌ సింగ్‌ రాజీనామాతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 116కు పడిపోయింది. తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్‌ ఆమోదిస్తే కూటమి బలం 105కి పడిపోతుంది. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. 

ప్రస్తుతం అమెరికా పరేటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి  హెచ్ డి కుమారస్వామి తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రికే అమెరికా నుంచి బయల్దేరుతున్నట్లు తెలిసింది.