గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేల రాజీనామా

రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన అల్పేశ్ ఠాకూర్, ధవళ్‌సిన్హా జలా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీని నమ్మి తాను కాంగ్రెస్‌లో చేరానని, దురదృష్ట వశాత్తూ ఆయన మాకోసం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలో తాము అవమానాలకు గురౌతూనే ఉన్నామని, అందుకే శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని ఠాకూర్ ప్రకటించారు. తాను తన ఆత్మప్రబోధానుసారం ఓటు హక్కును వినియోగించుకున్నానని, జాతీయ ధృక్కోణాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటును వినియోగించుకున్నానని పేర్కొంటూ బిజెపి అభ్యర్థులకే ఓట్ వేసిన్నట్లు పరోక్షంగా సంకేతం ఇచ్చారు. 

మరో ఎమ్మెల్యే ధవళ్‌సిన్హా కూడా ఇవే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను, తమ నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా అపహాస్యం చేశారని మండిపడ్డారు. మరో వైపు ఈ విషయంపై కాంగ్రెస్ స్పందించింది. 

ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని కాంగ్రెస్ నేత అశ్విన్ కొత్వాల్ ప్రకటించారు. అల్పేశ్ ఠకూర్ రధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధవళ్‌సిన్హా బయాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.