అజేయ భారత్-అటల్ బీజేపీ

2019 ఎన్నికలలో మరోసారి విజయం సాధించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులకు ‘అజేయ (ఎదురులేని) భారత్‌- అటల్‌ (తిరుగులేని) బిజెపి’ అనే కొత్త నినాదాన్ని ఆయన ఇచ్చారు. దిల్లీలో జరిగిన రెండు రోజుల పార్టీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముగింపు ప్రసంగం చేస్తూ 2019 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అటల్‌ అంటే చెక్కుచెదరని శక్తి అన్న అర్థం ఉందని, అలాగే అటల్‌ అంటే మన మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కూడా వస్తారని ఆయన వివరించారు. ఈ నినాదమే వాజ్‌పేయికి తగిన శ్రద్ధాంజలి కాగలదని అభివర్ణించారు.

దేశంలో ప్రతిపక్షానికి బిజెపిని ఢీకొట్టగల సత్తా లేదని ప్రధాని స్పష్టం చేసారు. సిద్ధాంతంలో కానీ, ఆచరణలో  కానీ.. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని ఎదుర్కొనే స్థితిలో లేదని చెప్పారు. అబద్ధాల ప్రాతిపదికగా ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ఆ పార్టీని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో బీజేపీ పాలనలో భారతదేశం బలమైన శక్తిగా రూపొందిందని, అదే సమయంలో పార్టీకి ఉన్న ప్రజాదరణ చెక్కుచెదరలేదని మోదీ భరోసా వ్యక్తం చేసారు. 

బీజేపీని నేరుగా ఢీకొనలేక ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోదీ ఎద్దేవా చేశారు. ‘రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ విపక్ష కూటమికి నాయకత్వం వహించడం ఆ కూటమిలోని చిన్న భాగస్వామిలకు ఆమోదయోగ్యం కాదని చెబుతూ కొందరైతే దానినొక భారంగా భావిస్తున్నారని ప్రధాని గుర్తు చేసారు. సొంత పార్టీలోనే కొందరికి ఆయన నాయకత్వం ఇష్టం లేదని అంటూ విపక్షానికి ఒక సైద్ధాంతికత లేదని, నాయకుడూ లేడని,  సమన్వయమూ లేదని, వాటి విధానాల్లో అస్పష్టత ఉందని, ఉద్దేశాల్లో అవినీతి ఉందని ప్రధాని దయ్యబట్టారు

విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయనీ, అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలోనూ అవి విఫలమయ్యాయని ప్రధాని ఆరోపించారు. ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుకోని ప్రతిపక్షాలు సయితం బిజెపిని ఓడించడానికి పరస్పరం ఆలింగనం చేసుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేసారు. విధానాలు, సైద్ధాంతికతలపై కాకుండా కల్పిత అబద్ధాలనే ప్రతిరోజూ వల్లెవేస్తూ వస్తున్నారని విమర్శించారు.

‘అస్పష్టమైన నీతి- భ్రష్టుపట్టిన నిజాయతీ’ ఇదే మహాకూటమి నినాదం కావొచ్చని ప్రధాని ఎద్దేవా చేసారు. విధానాల విషయంలో పోరాడగలం కానీ.. ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలకేం జవాబు చెప్పగలమని ప్రశ్నించారు. విషయాలపై చర్చ జరిగితే మన దేశానికి 48 ఏళ్లలో ఒక కుటుంబం ఏం చేసింది, 48 నెలల్లో తన సర్కారు ఏం చేసిందనేది తేలిపోతుందని ప్రధాని అవహేళన చేసారు. కాంగ్రెస్‌ ముసుగును తొలగించాల్సిందిగా బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గుజరాత్‌ను అప్రతిహతంగా 31 ఏళ్లు పాలించిన రీతిలోనే దేశాన్నీ దీర్ఘకాలం పాటు పాలిస్తామని ధీమా వ్యక్తం చేసారు. బీజేపీవద్ద పటిష్టమైన నాయకత్వం, విధానాలు, దేశాన్ని అభివృద్ధి చేయాలనే నిజాయితీ ఉన్నదని తెలిపారు. ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ అన్న తన నినాదం ప్రపంచమంతా మారుమోగుతుందని మోదీ చెప్పారు.

ఉజ్వల పథకాన్ని అమలు చేసి ఇంటింటికీ గ్యాస్‌ అందించినప్పుడు ఆ గ్యాస్‌ సిలిండర్‌ అందుకున్న వారు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం వారో? వారి ఆర్థిక స్థితిగతులేమిటో తాము పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. 18వేల గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం అందిందన్నారు. అక్కడి ప్రజలు తమకు ఓటు వేశారా లేదా అని కూడా తాము ఆలోచించలేదని అన్నారు.

తానెప్పుడు ప్రజల శ్రేయస్సు కోసమే తప్ప అధికారం కోసం పాకులాడలేదని మోదీ తెలిపారు. బీజేపీ నీతి- రణనీతి అన్న రెండు చక్రాల ఆధారంగా ముందుకెళుతుందని చెబుతూ  రణనీతి ఎలా ఉన్నా, నీతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయగలిగే పార్టీ ఏదీ కనిపించడం లేదని, అసలు ప్రతిపక్షాలు ఎక్కడున్నాయో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

ఇతర పార్టీల మాదిరిగా బిజెపికి అధికార అహంకారం తలకెక్కలేదనీ, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దోచేయాలనే ఉద్దేశం కూడా తమకు లేదనీ మోదీ స్పష్టం చేసారు.  అధికారాన్ని ప్రజా సాధికారతకే వాడామని చెబుతూ సిద్ధాంతాలకు కట్టుబడి, వాటి కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. బ్యాంకుల్ని, గనుల్ని జాతీయీకరణ చేసి, ఆ చర్యలు పేదలకు మేలు చేస్తాయని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత సంస్కరణల పేరుతో పథం మార్చిందని విమర్శించారు. వాటివల్ల పేదలకు ఏ మేరకు ప్రయోజనం వాటిల్లిందో అడగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తమ సర్కారు చర్యలవల్ల పేదల ఇళ్లకు విద్యుత్తు, ఎల్పీజీ, బీమా వంటివి లభించాయని చెప్పారు. ఏకకాల ఎన్నికలపై ఒత్తిడి తీసుకురావాలనేది తమ ఉద్దేశం కాదనీ, అయితే దీనిపై అన్ని వర్గాల్లో చర్చ జరగాలని వివరించారు.