అసెంబ్లీ రద్దు రోజుననే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పలుచోట్ల పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతూ ఉండడంతో కొన్ని మార్పులు చేయక తప్పక పోవచ్చని తెలుస్తున్నది. తమకు సీట్ ఖరారు అయినదని సంబర పడుతున్న కొందరికి ఆశాభంగం తప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నిక పక్రియ ప్రారంభం కావడానికి మరో రెండు నెలల వరకు సమయం ఉండడంతో, అన్ని రోజుల పాటు నియోజకవర్గాలలో `సంతృప్తికరంగా’ ప్రచారం చేయడం, పార్టీలో అందరిని కలుపుకు పోవడం అంత తేలిక కాని విషయమే.
ఒక విధంగా కెసిఆర్ ముందుగా అభ్యర్ధులను ప్రకటించి తమకు మేలు చేసారని ప్రతిపక్షాలు సంబర పడుతున్నాయి. ఈ విధంగా అధికార పార్టీలో వ్యక్తమవుతున్న అసమ్మతి తమకు ఉపయోగ పడగలదని భావిస్తున్నారు. ముఖ్యంగా టిడిపి నుండి పార్టీలో చేరిన ఎమ్యెల్యేల నియోజక వర్గాలలో తొలి నుండి పార్టీలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ గా ఉన్నవారు ఇప్పుడు కుడా తమకు సీట్ ఇవ్వరా అంటూ నిలదీస్తున్నారు. కొందరు బహిరంగంగానే దిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.
పలు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్ధులపై తిరుగుబాటు అభ్యర్ధులు పోటీ చేసి, వారిని ఓడించడం కోసం పట్టుదలగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ మద్దతు దారులతో `అసమ్మతి’ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత బహిరంగంగా టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలు గతంలో ఎన్నడు వ్యక్తం కాలేదు.
టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ అసమ్మతి జెండా ఎగురవేశారు. దేవరకొండ నియోజకవర్గం టికెట్ తనకు కాకుండా రవీంద్రనాయక్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. రెండు మూడు రోజుల్లో బాలు నాయక్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
సీట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మందమర్రిలో తన అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 60 శాతం మంది ప్రజలు తనకు అనుకూలంగా ఉన్నా ఎంపి బాల్క సుమన్ సర్వే నివేదికను మార్చి, అధిష్టానానికి తప్పుడు నివేదిక పంపారని ఆరోపించారు. తాను సుమన్ కు మద్దతు ఇస్తానని చెప్పిన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ అధినేత కెసిఆర్ వాస్తవాలను గ్రహించి తిరిగి సీట్ తనకే ఇస్తారని ఓదెలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టిడిపి నుండి వచ్చిన ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్ కు కేటాయించడాన్ని స్థానిక కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్ధిని మార్చవలసిందే అంటూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని డిమాండ్ చేసారు. లేని పక్షంలో పోటీ అభ్యర్ధిని నిలబెడతామని స్పష్టం చేస్తున్నారు.. అవసరమైతే జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తానని టీఆర్ఎస్ నేత మురళీగౌడ్ ప్రకటించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో ‘రెబెల్స్’ పోరు ఉధృతమవుతోంది. సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు కేటాయించడంతో టికెట్‌పై ఆశించి భంగపడ్డ కోటిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. రెండు వేల మంది అనుచరులతో కోటిరెడ్డి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. మహబూబాబాద్ టిక్కెట్‌ను ఉద్యమకారులకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్వీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు వత్యిరేకంగా అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఆయనకు వ్యతిరేకంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట శివారులో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్థిని మార్చాలని కార్యకర్తలు సమావేశంలో డిమాండ్ చేశారు.భూపాలపల్లి టికెట్ కేటాయింపుపై గండ్ర సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే టీడీపీని వీడి 15వేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్లో చేరానని చెబుతున్నారు.