సెప్టెంబ‌రు 5 నుంచి కొత్త ఇసుక విధానం

చంద్రబాబు నాయుడు పాలనలో అధికార పార్టీ ఎమ్యెల్యేలు, ఇతర నేతల అంతులేని అవినీతికి అధారంగా అప్రదిష్ఠకు గురైన ఇసుక విధానమును సంస్కరించి, కొత్త ఇసుక విధానం అమలు గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇకపై ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు.

అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌యార్డులు  ఏర్పాటు చేయాలని అన్నారు. 

ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదును ఇవ్వాలని.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు. స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇసుక బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు. మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాలను గుర్తించాలని, వాటికి జీపీఎస్‌ అమర్చాలని ఆదేశించారు.    ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను ఏపీఎండీసీ తయారుచేయనుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు.