మరో 50 ఏళ్లు అధికారం మనదే: అమిత్‌ షా

2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తిరిగి గెలవడంతో పాటు మరో 50 ఏళ్లు అధికారంలో కొనసాగుతుందని బిజెపి అద్యక్షుడు అమిత్ షా భరోసా వ్యక్తం చేసారు. జాతీయ కార్యవర్గ సమావేశాలలో ప్రసంగిస్తూ ఇది తానేమీ అహంకారంతో చెప్పడం లేదనీ, ప్రభుత్వ పనితీరు ఆధారంగానే చెబుతున్నాననీ స్పష్టం చేసారు.

‘పార్టీకి 9 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. అంటే 36-40 కోట్ల మంది ప్రజలతో టచ్‌లో ఉన్నట్లే. 21 కోట్ల కుటుంబాలను, అంటే 110 కోట్ల మందిని మనం చేరుకోవాలి. మోదీ ఇప్పటికే 300 లోక్‌సభ నియోజకవర్గాలకు వెళ్లారు. మిగిలినవాటినీ తదుపరి ఎన్నికల్లోగా చేరుకుంటారు. పనితీరు ఆధారిత రాజకీయాలవైపు దేశం నడుస్తోంది’ అని పేర్కొన్నారు. 2001లో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యాక బిజెపి అక్కడ ఎప్పుడూ ఓడిపోలేదని గుర్తు చేసారు. పనితీరే దానికి కారణం అని చెప్పారు.

దేశంలో 1947లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా 1967 వరకు అధికారంలో కొనసాగిందని చెబుతూ బిజెపి అలాగే చేయగల సత్తాతో ఉందని షా ధీమా వ్యక్తంచేసారు. అక్రమ చొరబాటుదారులకు దేశం ఇక ఎంతమాత్రం సురక్షితం కాదని చెబుతూ అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలను దేశం నుంచి పంపించే చర్యల్ని ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఏ దేశంలోనూ లేనిరీతిలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు మన దేశంలో కొన్ని విపక్షాలు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు.