దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాలు!

కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రస్తుతమున్న చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, దేశవ్యాప్తంగా కార్మికుల కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేందుకు వీలు కల్పించే వేజెస్ కోడ్ బిల్లును ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.  ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెడుతామని సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 

వేజెస్ కోడ్ బిల్లును 2017 ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపగా, 2018 డిసెంబర్ 18న ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే మే నెలలో 16వ లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన చెల్లింపుల చట్టం-1936, కనీస వేతన చట్టం-1948, బోనస్ చెల్లింపుల చట్టం-1965, సమాన పారితోషిక చట్టం-1976 స్థానంలో ఈ బిల్లును తీసుకురానున్నారు. కాగా, సముద్రమార్గంలో ప్యాసింజర్, కార్గో సేవలను ప్రారంభించేందుకు మాల్దీవులతో కుదిరిన అవగాహన ఒప్పందానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.   

దేశంలోని మూడు ప్రధాన విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ) ఆధ్వర్యంలోని అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులను ప్రభు త్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో అదానీ గ్రూప్‌నకు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మూడు విమానాశ్రయాలను 50 ఏండ్లపాటు నిర్వహించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో అదానీ గ్రూప్ కాంట్రాక్ట్ దక్కించుకున్నది. జైపూర్, గువాహటి, తిరువంతపురం విమానాశ్రయాల నిర్వహణ బిడ్లను కూడా ఆ సంస్థే దక్కించుకోవడం విశేషం. 

కాగా, వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.65 (3.7 శాతం) పెంచింది. దీంతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ.1,815కు పెరిగింది. వరితోపాటు నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరలను పెంచుతూ  కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఉత్పత్తి వ్యయానికి కనీసం రూ.1.5 రెట్లు అధికంగా ఉండేలా మద్దతుధరలను నిర్ణయించాలని గతేడాది ప్రభుత్వం ప్రకటించిన మేరకు వీటిని పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్వెల్లడించారు.