గగనతలం మూసివేతతో పాక్ కు భారీ నష్టం

భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసివేస్తే అది కాస్తా బెడిసికొట్టి వారికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. గగనతలాన్ని మూసివేయడం వల్ల ఇస్లామాబాద్‌ దాదాపు 100 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్‌కు ఇది పెనుభారంగా మారింది. 

పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులతో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ గగనతలం మీదుగా భారత విమాన రాకపోకలు జరగకుండా ఆంక్షలు విధించింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఎయిర్‌లైన్లకు అదనపు ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయాలు, సిబ్బంది వినియోగం, ప్రయాణ సమయం పెరిగాయి. గగనతలాన్ని మూసివేయడంతో రోజుకు దాదాపు 400 విమానాలు ప్రత్నామ్నాయ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. 

అయితే గగనతలం మూసివేత వల్ల పాకిస్థాన్‌ పౌర విమానయాన సంస్థ (సీఏఏ) ఆదాయానికి కూడా గండిపడిందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా తమ గగనతలం మీదుగా వెళ్లే విమానాలకు రూట్‌ నావిగేషన్ ఛార్జీలు, ఎయిర్‌పోర్టు ఛార్జీలు విధిస్తుంటారు. విమాన కేటగిరి, అది వెళ్లే మార్గాన్ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. 

ఉదాహరణకు తమ గగనతలంలో ప్రయాణించే బోయింగ్‌ 737 విమానానికి పాక్‌ రోజుకు 580 డాలర్ల చొప్పున వసూలు చేస్తోంది. పెద్ద విమానాలు అయితే ఛార్జీ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది.  నావిగేషన్‌ ఛార్జీలు, పార్కింగ్‌, ఎయిర్‌పోర్టు రుసుములు అన్నీ కలిపి పాక్‌ సీఏఏ రోజుకు 3లక్షల డాలర్ల చొప్పున నష్టపోయిందని ఈ సర్వేతో సంబంధమున్న కొన్ని వర్గాలు చెబుతున్నాయి. 

దీనికి తోడు కౌలాలంపూర్‌, దిల్లీ, బ్యాంకాక్‌లకు విమాన సర్వీసులు రద్దు చేయడంతో ఆ దేశ ఎయిర్‌లైన్లు కూడా రోజుకు 4.6లక్షల డాలర్లు నష్టపోతున్నాయట. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా గగనతలం మూసివేత వల్ల పాక్‌ రోజుకు 7.6లక్షల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అలా ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు 100 మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

ఇంత జరుగుతున్నా పాక్‌ మాత్రం తేరుకోవడంలేదు. ఇప్పటికే గగనతలంపై ఆంక్షలు ఎత్తివేయలేదు. జులై 12 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల పాక్‌ సీఏఏ ప్రకటించింది.