టెలికం సంస్థలపై ట్రాయ్ కొరడా!

టెలికం నియంత్రణ మండలి ట్రాయ్.. టెలికం సంస్థలపై కొరడా ఝులిపించబోతున్నట్లు తెలుస్తున్నది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమైనందుకుగాను భారీ జరిమానా విధించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత సంవత్సరం తొలి త్రైమాసికంలో(మార్చితో ముగిసిన మూడు నెలలకాలం) వినియోగదారులకు కల్పించిన సౌకర్యాలపై ట్రాయ్ విధించిన మార్గదర్శకాలకు లోబడి లేకపోవడంతో ఈ జరిమానా విధించబోతున్నది.

ధరల యుద్ధానికి తెరలేపుతూ 2016లో టెలికం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియోపై రూ.34 లక్షలు విధించినట్లు తెలుస్తున్నది. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించకలేకపోవడం, ఇంటర్‌కనెక్ట్ కంజెక్షన్, కస్టమర్ కేర్ సెంటర్, కాల్ టూ కాల్ సమాధానం ఇచ్చేటప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని తేలింది. అలాగే భారతీ ఎయిర్‌టైల్‌పై రూ.11 లక్షలు, ఐడియాపై రూ.12.5 లక్షలు, వొడాఫోన్‌పై రూ.4 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు విభిన్న వర్గాల ద్వారా తెలిసింది.

జనవరి-మార్చి నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ జరిమానాలపై జియోతోపాటు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు స్పందించడానికి నిరాకరించారు. దీనిపై ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ అంతకుముందు మాట్లాడుతూ..మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెలికం సంస్థలు నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా సేవలు అందించలేకపోయాయని, వీటిపై జరిమానాపై తుది దశకు చేరుకున్నదని చెప్పారు. ఎంతమేర విధించేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.