ఆకాశ్‌ విజయ్‌ వర్గియాపై మోదీ ఆగ్రహం

మధ్య ప్రదేశ్ లో మున్సిపల్‌ అధికారులపై బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌ వర్గియా దాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ భేటీలో ఈ విషయం గురించి ప్రస్తావించిన ఆయన పార్టీ ఎంపీలకు గట్టి హెచ్చరికలు చేసినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారు ఎవరైనా సరే సహించేది లేదని మోదీ స్పష్టం చేశారట. 

‘పార్టీ పేరును దెబ్బతీసే నేతలు మనకొద్దు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఎవరి కుమారుడైనా సరే, బంధువైనా సరే అలాంటి వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి మద్దతిచ్చే వారిని కూడా తొలగించాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. పార్టీ పేరు చెప్పి దురుసుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు’ అని మోదీ ఆకాశ్‌ను ఉద్దేశిస్తూ అన్నట్లు తెలిసింది. 

బీజేపీ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ కైలాశ్‌ విజయ్‌ వర్గియా కుమారుడే ఆకాశ్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌-3 నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆకాశ్‌.. ఇటీవల మున్సిపల్‌ అధికారులపై క్రికెట్‌ బ్యాట్‌తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. 

ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు ఆకాశ్‌ను అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఆకాశ్‌ విడుదలైన సమయంలో కొందరు పార్టీ కార్యకర్తలు ఆయనకు భారీగా స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై తొలిసారిగా స్పందించిన మోదీ.. ఆకాశ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని ఈ సందర్భంగా గట్టిగా చెప్పారు. 

‘‘ఆకాశ్ విజయ్‌వర్గీయ ఇటీవల ప్రవర్తించిన తీరుపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆకాశ్ జైలు నుంచి బయటికి రావడాన్ని స్వాగతించిన స్థానిక బీజేపీ విభాగాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ప్రధాని ఆదేశించారు..’’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా ప్రధాని పేర్కొన్నారు. 

‘‘ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టాలి. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న వారిని కూడా ప్రశ్నించాలి. పార్టీ ఎంపీలంతా బాధ్యతాయుతంగా, సహృదయంతో వ్యవహరించండి...’’ అని ప్రధాని పేర్కొన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో పూర్తి సమయం ఉండాలనీ.. సామాన్యుల సమస్యలను లేవనెత్తాలని కూడా ప్రధాని హితవు చెప్పారు. 

ఇలా ఉండగా, జులై 6న తన సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయించారు. బిజెపి  సిద్ధాంతకర్త శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు. 

అదే రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఐదు మొక్కలు నాటాలని మోదీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.