జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదం, ఉగ్రవాదాల్ని సహించం

జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమం, ఉగ్రవాదాల్ని సహించేది లేదని హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఎవ్వరూ విడదీయలేరని పేర్కొంటూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే ఎలాంటి యత్నాలకైనా తగిన జవాబు ఇస్తామని భరోసా ఇచ్చారు. 

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపుపై రాజ్యసభలో చేపట్టిన చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ భారత్‌ శాంతినే కోరుకుంటుందని, అయితే, మన సరిహద్దుల్ని గౌరవించని వారితో కాదని చెప్పారు.  మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదన్నారు. ఎన్‌ఐఏ, పన్నుల విభాగం వంటి కేంద్ర సంస్థలు జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల ఆర్థిక వనరుల్ని నిలిపి వేసేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. 

కశ్మీర్‌ సమస్యపై గత 70 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానం ఎలాంటి ఫలితాల్ని ఇవ్వని నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి సరికొత్త ఆలోచనా విధానం అవసరమని పేర్కున్నారు. అభివృద్ధితో తాము కశ్మీరీ ప్రజల మనసుల్ని గెలుచుకుంటామని చెప్పారు.  

కశ్మీర్‌ సమస్యకు సంబంధించి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఎందుకు వెళ్లిందని, ప్లెబిసైట్‌కు ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు. చారిత్రక తప్పిదాలు ఎల్లప్పుడూ చర్చనీయాంశాలే అని పేర్కొన్నారు. 

జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)పై విపక్ష నేతలు చేసిన విమర్శల్ని ప్రస్తావిస్తూ.. చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని, చొరబాటుదార్లను గుర్తించి, పంపించి వేయాలనేది మోదీ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే హిందువులకు భారతీయ పౌరసత్వాన్ని సిటిజన్‌షిప్‌ బిల్లు కల్పిస్తుందని చెప్పారు. పరోక్ష పాలనను కొనసాగించేందుకు బిజెపి రాష్ట్రపతి పాలనను ఉపయోగించుకుంటోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. 

దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 చోట్ల అధికారంలో ఉన్న తమ పార్టీ అధికార కాంక్షతో లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు బిజెపి సిద్ధమని, ఈ ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరిస్తే రేపే బిల్లు తెచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. 

‘కశ్మీర్‌ పండిట్లను, సూఫీ సంప్రదాయాలను రాష్ట్రం నుంచి ఎవరు తరిమేశారు, అవి కశ్మీరీ సంప్రదాయంలో భాగం కాదా’ అని ప్రశ్నించారు. ప్రజల భద్రత కోసమే రహదారుల్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరులందరి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికీ భయం అక్కర్లేదన్నారు. భారత్‌ను ముక్కలు చేస్తామని చెప్పేవారికి అదే భాషలో జవాబిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన సమయంలో 2 వేల మందికి కల్పించిన భద్రతను సమీక్షించి, 919 మందికి ఉపసంహరించామని చెబుతూ ఇందులో 8 మంది వేర్పాటువాదులు కూడా ఉన్నారని తెలిపారు.