మహిళల భద్రత కోసం 3 వేల కోట్లు

సురక్షిత నగరాల పథకం కింద మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,919.55 కోట్లు కేటాయించింది. నిర్భయ నిధి కింద ఎనిమిది నగరాలకు ఈ సొమ్ము ఇస్తున్నట్టు హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహిళా సురక్ష నగరాల పథకంలో భాగంగా ఈ నిధులను దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, లఖ్‌నవూ నగరాలకు కేటాయించారు.

2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఈ నిధులను వెచ్చించనున్నారు. ఆయా రాష్ట్రాల పోలీసులు, సంబంధిత నగర పాలక సంస్థల అధికారులతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తారు. వివిధ పనులు చేపట్టడానికి నిర్భయ నిధి కింద కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వనుండగా, మిగిలిన 40 శాతాన్ని ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది.

ఈ నిధులతో మహిళలు, పిల్లల విశ్రాంతి కోసం డార్మెట్రీలు, మెరుగైన ఎల్‌ఈడీ వీధి దీపాలు, సీసీటీవీ కెమేరాలు, సంక్షోభ నివారణ కేంద్రాలు, ఫోరెన్సిక్‌, సైబర్‌ క్రైం విభాగాలు, మహిళా పోలీసులతో గస్తీ దళాలు వంటి సౌకర్యాలను కలిగిస్తారు. మహిళల భద్రత కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ‘షి’ బృందాలు, ‘అభయం’ వ్యాన్లు వంటి పథకాలను సమగ్రంగా పరిశీలించి, వాటి పనితీరు మెరుగుకు సూచనలు ఇస్తారు.

నేరాలు అధికంగా జరిగే ప్రదేశాల్లో సురక్షిత ప్రాంతాలను, ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రత కల్పించడం, అత్యసర పరిస్థితుల్లో సహాయం పొందడం కోసం మీట నొక్కేందుకు వీలుగా ప్యానిక్‌ బటన్లు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు నిర్మించడం వంటివి ఇందులో ఉన్నాయి. మహిళలు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి వీలుగా అక్కడ  సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి సలహాదార్లను నియమించనున్నారు.

సమస్యలకు ఒకే దగ్గర పరిష్కారం లభించేలా వన్‌ స్టాప్‌ క్రైసిస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తారు. మహిళల్లో సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్న భరోసా కల్పించడమే వీటి ఉద్దేశం. నేరాలను అధికంగా జరిగే ప్రాంతాలను జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌)తో అనుసంధానించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు.