జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు కొనసాగనున్నది. రాష్ట్రపతి పాలన గడువు మంగళవారంతో ముగుస్తుండ టంతో కేంద్రం రూపొందించిన పొడిగింపు బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇది మంగళవారం నుంచి అమలులోకి రానున్నది. ఈ బిల్లుకు టీఎంసీ, ఎస్పీ, పీడీపీ మద్దతు పలికాయి. 

దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు సమీప గ్రామాల ప్రజల కోసం ఉద్దేశించిన జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2019కు సైతం ఆమోదముద్ర పడింది. ఈ రెండు బిల్లులను సోమవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఈసీ జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఎన్నికలను ఏడాది చివర్లో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో కేంద్రం వద్ద మరోమార్గం లేకపోయింది అని చెప్పారు.

ఎన్నికలు ఎందుకు జరుపలేదన్న ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసంలో ఎన్నికలు జరుపలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర మొదలైందని, బకర్వాల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లో అత్యధికశాతం మంది వారి జీవనోపాధికోసం వెళ్లారని, తిరిగి అక్టోబర్‌లో వస్తారని చెప్పారు. దీంతో ఎన్నికలను ఏడాది చివర్లో నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. 

ఎన్నికలకు సిద్ధమని ఈసీ ప్రకటిస్తే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు. తాము కశ్మీర్‌లో అభివృద్ధిని కోరుకుంటున్నామని వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని సహించేదిలేదని స్పష్టంచేశారు. భారత్ వ్యతిరేకులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు-2019 ప్రకారం రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలకు ఉద్యోగాలు, పదోన్నతులు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుంది. కఠువా, సాంబా, జమ్మూ జిల్లాల్లోని 435 గ్రామాల్లో నివసిస్తున్న 3.5 లక్షల మంది ప్రజలకు ఇది లబ్ధి చేకూర్చుతుంది. 

పాకిస్థాన్ చర్యలతో సరిహద్దు ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇప్పటి కే వారికి అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ బిల్లుతో వారి మనసులు గెలుస్తామని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీలో కాలేజీ లేదా వర్సిటీని యూనిట్‌గా తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా ఆమోదముద్ర పడింది.