కర్ణాటక సంకీర్ణంలో సంక్షోభం .. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేల రాజీనామా

కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి సంక్షోభం ఒడ్డుకు నెట్టివేసిన్నట్లయింది. అనూహ్యంగా ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో కొద్దిపాటి మెజార్టీలో అధికారంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 

ఉదయం బల్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, మరో కొద్దీ సేపటికి మరో ఎమ్మెల్యే (బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గం) రమేశ్ జర్కి హోలి తన పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ సర్కారు సంకటంలో పడింది. 

రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించానని ఆనంద్ సింగ్  తెలిపారు. ఆయన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. మరో ఎమ్మెల్యే జర్కిహోలి రాజీనామా ధ్రువీకరించాల్సి ఉంది.  

ఆనంద్‌ రాజీనామాతో డీలా పడ్డ కాంగ్రెస్‌కు మరో ఏడుగురు రెబెల్‌ ఎమ్మెల్యేలు షాక్‌ ఇవ్వనున్నారనే కధనాలు వెలువడుతున్నాయి. జిందాల్‌ కంపెనీకి భూముల విక్రయంపై హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌పై ఆనంద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఈ పరిణామాల పట్ల కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ రాజీనామాలను నమ్మలేక పోతున్నట్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని కాంగ్రెస్‌-జేడీఎస్‌ పేర్కొంటుండగా.. తాజా పరిణామాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.

ఈ పరిణామాలతో అప్రమత్తమైన కర్ణాటక రాష్ట్ర సీఎల్పీ లీడర్ సిద్దరామయ్య కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌ను తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాపై సమావేశంలో చర్చిస్తున్నారు.

  కాగా, తాము ప్రభుత్వాన్ని కూలదోయాలని చూడడం లేదని, బీజేపీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని చెప్పారు. 

కర్ణాటకలో 225 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌ 37 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కావాల్సిన 113 స్థానాలకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. తాజా రాజీనామాలతో ప్రభుత్వ బలం 115కు పడిపోయింది. మరోవైపు భాజపాకు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.