దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన జీఎస్టీ

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి రెండేండ్లు పూర్తయ్యింది. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా ఈ చారిత్రక పరోక్ష పన్ను అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సాక్షిగా ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే మార్కెట్ పేరుతో జీఎస్టీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆచరణలోకి తెచ్చిన సంగతీ విదితమే. డజనుకుపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులను విలీనం చేస్తూ వచ్చిన ఈ మెగా ట్యాక్స్‌లో 0, 5, 12, 18, 28 శ్లాబులను ఏర్పాటు చేశారు.

500లకుపైగా సేవలు, 1,200లకుపైగా వస్తువులకు ఈ శ్లాబుల్లో పన్నులు పడుతుండగా, బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం, ముడి వజ్రాలు, విలువైన రత్నాలపై 0.25 శాతం పన్నును వసూలు చేస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, విద్యుత్‌ను జీఎస్టీలోకి తీసుకు రాలేదు. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితర వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు.

నిజానికి జీఎస్టీ రాకతో కేంద్రం ఆదాయం భారీగానే తగ్గిపోయింది. రాష్ర్టాలకు ఐదేండ్లపాటు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో జీఎస్టీలో వచ్చే కేంద్రం ఆదాయ వాటాలో రాష్ర్టాలకు భాగంగా వెళ్తున్నది. దీంతో ఆదాయం పెంచుకునే మార్గాల ను అన్వేషిస్తున్న మోదీ సర్కారు.. పన్ను ఎగవేతలపై దృష్టి సారించింది. ఈ రెండేండ్లలో జీఎస్టీలో విధానపరమైన మార్పులను చాలానే చేసింది.

జీఎస్టీ అమలై రెండేండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఈ పరోక్ష పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నది. కొత్త రిటర్నుల వ్యవస్థ, నగదు లెడ్జర్ వ్యవస్థ హేతుబద్దీకరణ, సింగిల్ రిఫండ్-పంపిణీ విధానం వంటివి ఇందులో ఉన్నాయి.

 రాబోయే జీఎస్టీ మండలి సమావేశాల్లో మరిన్ని వస్తువుల ను దిగువ శ్రేణి శ్లాబుల్లోకి మార్చే వీలు కూడా ఉన్నది. ఇప్పటికే చాలా వస్తువులను ఎగువ శ్రేణి శ్లాబుల నుంచి కింది స్థాయి శ్లాబుల్లోకి మార్చినది తెలిసిందే. శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించే వీలుందని సమాచారం. జీఎస్టీ ఆదాయం పెరిగితే జీఎస్టీ భారాన్ని తగ్గిస్తామని కేంద్రం ఎప్పట్నుంచో చెబుతున్నది తెలిసిందే.

ఇదిలావుంటే పరోక్ష పన్నుల వసూళ్లు తగ్గిపోతున్నాయని, కేంద్ర పథకాల కట్టడి అవసరమని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీని మరింత కట్టుదిట్టం చేయాలని, లోపాలను సరిదిద్దితేగానీ ప్రభుత్వ ఆదాయం పెరుగదని హెచ్చరించారు. గడిచిన రెండేండ్లలో జీఎస్టీ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం చాలావరకు మార్చేసింది. పన్నుల భారం ఎక్కువైపోయిందంటూ వ్యాపార, పరిశ్రమ వర్గాలు చేసే వినతుల దృష్ట్యా సవరణలు చేసింది.

ఇక పన్ను ఎగవేతలను అరికట్టడానికి జీఎస్టీ ఈ-వే బిల్లులు, వినియోగదారులకు జీఎస్టీ ప్రయోజనం అందేలా యాంటీ ప్రాఫిటీరింగ్ వ్యవస్థలనూ కేంద్రం తీసుకొచ్చింది. కాగా, జీఎస్టీని విస్తరించాలని, విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, మధ్యంలను కూడా ఈ పన్ను పరిధిలోకి తీసుకురావాలని దేశీయ పరిశ్రమ కేంద్రానికి సూచనలు చేస్తున్నది.