కుప్పకూలిన విమానం.. 21 మంది మృతి

దక్షిణ సుడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఓ కమర్షియల్ విమానం ఒక్కసారిగా సరస్సులో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో బయటపడ్డారు.

జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన ఆ విమానం సరస్సులో కూలిందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి టాబన్‌ అబెల్‌ ప్రకటన చేశారు. తీవ్రగాయాలతో బయటపడిన వారిలో ఆరేళ్ల బాలిక, ఓ ఇటాలియన్‌ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నారని, వారిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ విమానంలో 19 మంది ప్రయాణం చేయడానికే అనుమతి ఉండగా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినందుకే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరస్సులో నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని అక్కడి అధికారులు చెప్పారు.

కాగా, దక్షిణ సుడాన్‌లో విమాన ప్రమాద ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. 2017లో వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పులతో జరిగిన ఓ విమానాన్ని అత్యవసరంగా దించే క్రమంలో మంటలు అంటుకున్నాయి. అందులోని నలుగురు అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. 2015లో జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ విమానం కుప్పకూలడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.