విపత్తులు ఎదుర్కోవడానికి ‘చైన్ ఆఫ్ కమాండ్’


ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక ‘చైన్ ఆఫ్ కమాండ్’ ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. ముఖ్యంగా వివిధ శాఖలకు చెందిన సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నప్పుడు ‘చైన్ ఆఫ్ కమాండ్’ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో భారత్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వం సంస్థలకు పిలుపునిచ్చారు. 

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) నిర్వహిస్తున్న రెండు రోజుల వార్షిక సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక శాఖలతో సంప్రదించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ల (ఎస్‌డీఆర్‌ఎఫ్‌ల) సామర్థ్యాన్ని పెంచడంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను కాని, మనుషులు సృష్టించిన విధ్వంసాలను కాని వేగవంతంగా ఎదుర్కోవడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు వివిధ రాష్ట్రాలలో 12 బెటాలియన్లు ఉన్నాయి. 

వివిధ సంస్థలు, భాగస్వాములు, శాఖల మధ్య ఒక ‘చైన్ ఆఫ్ కమాండ్’ను నిర్ణయించాలని, వైపరీత్యాలను ఎదుర్కొనే సమయంలో దానిని ఏర్పాటు చేయాలని  అమిత్ షా సూచించారు. ‘ఇది చాలా ముఖ్యమయినది. ఎందుకంటే ప్రొటోకాల్, అధికారక్రమం లేకపోవడం వల్ల తలెత్తిన అస్తవ్యస్త స్థితిని నేను చూశాను’ అని అమిత్ షా చెప్పారు. అధికారిక ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఎవరు కూడా మరొకరు చెప్పిన దానిపై శ్రద్ధ పెట్టరని, దేశ అధికార వ్యవస్థలో ఇదో పెద్ద లోపమని ఆయన పేర్కొన్నారు. 

ఎన్‌డీఆర్‌ఎఫ్ వంటి సంస్థలు గతంలో తాము సాధించిన విజయాలను స్మరిస్తూ కాలం గడపరాదని, మరింత మెరుగయిన రీతిలో పనిచేయడానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘విపత్తుల నిర్వహణలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయడానికి ఇదే తగిన సమయం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రయాణించాల్సిన మార్గం దూరమని, కాని, దాన్ని చేరడమే మన లక్ష్యం కావాలని ఆయన పేర్కొన్నారు.