పరారీ ఆర్థిక నేరగాళ్లను వదలొద్దు

పరారీ ఆర్థిక నేరగాళ్లను వదలొద్దని, వారిపట్ల కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ20 వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారత్ నుంచి పాల్గొన్న సురేష్ ప్రభు విలేఖరులతో మాట్లాడుతూ పన్ను ఎగవేతలు, అవినీతి, ఆర్థిక మోసాలు, పరారీ నేరగాళ్లు అంశాలను ప్రధానంగా తీసుకుని తమ ప్రభుత్వం పోరాడుతున్నట్లు చెప్పారు. 

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాలు, ఖండాలు దాటిపోతున్న వ్యక్తులతో తలెత్తుతున్న చట్టపరమైన ఇబ్బందుల అంశాన్ని భారత దేశం తన అజెండాలో ప్రధానంగా ఎంచుకుంది. ఆర్థిక నేరగాళ్ల అప్పగింతలో అన్ని దేశాల సరైన బాధ్యతాయుత వైఖరి కీలకం అని మోడీ స్పష్టం చేశారు.  పలువురు ప్రముఖ నేతలతో ముఖాముఖీ, బహుముఖ చర్చలలో ఇదే అంశాన్ని తీసుకువచ్చారు. ఓ వైపు భారతదేశంలో ప న్నుల ఎగవేతను అరికట్టడం, అవినీతి నిరోధక చర్యలు వేగవంతం చేస్తున్న దశ లో ఆర్థిక నేరగాళ్లు తప్పించుకుపోవడం చిక్కులు తెచ్చిపెడుతున్న విషయాన్ని మోడీ ప్రస్తావించారని సురేష్ ప్రభు వివరించారు. 

ఇదిలావుంటే డిజిటల్ ఎకానమీపై ఒసాకా డిక్లరేషన్‌లో భారత్ ఎందుకు భాగస్వామి కాలేదన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ కారణాలను జపాన్ ప్రధాని షింజో అబేకు తెలియపరుచామని చెప్పారు. డిజిటల్ ఎకానమీని భారత్ గట్టిగా విశ్వసిస్తున్నదని, ఇందులో భాగంగానే బ్యాంక్ ఖాతాలను పెద్ద ఎత్తున తెరిపిస్తున్నామని గుర్తుచేశారు.

బహుళ వినిమయ ఇంటర్నెట్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉందని జి 20 దేశాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదం, తీవ్రవాద వ్యాప్తికి, నిధుల సమీకరణకు ఈ సాంకేతికత వినిమయం జరగకుండా అన్ని దేశాలు సరైన విధంగా స్పందించాల్సి ఉందని నేతలు పిలుపు నిచ్చారు. సంయుక్త తీర్మానంలో దీనిని ప్రస్తావించారు. 

ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమంతో ముప్పు తెచ్చిపెట్టే ధోరణులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. సైబర్ నేరాల అదుపు దిశలో ప్రత్యేకించి ఉగ్రవాద అంతర్వాహినిగా ఇంటర్నెట్ మారకుండా చూడాల్సి ఉందని స్పష్టం చేశారు.