సరైన సమయంలో 370ని తొలగిస్తాం

కీలకమైన ఆర్టికల్ 370 ను తొలగించాల్సిందేనని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కరాఖండిగా స్పష్టం చేశారు.  దీనిపై తమ పార్టీ విధానమేందో అందరికీ తెలిసిందేనని చెబుతూ మొదటి నుంచీ దీనిపై తమ విధానమేమీ మారలేదని, సరైన సమయంలో దీనిని తొలగిస్తామని వెల్లడించారు. దీనిని ప్రవేశ పెట్టినప్పుడే చేసేటప్పుడే ఇది తాత్కాలికమైన చర్యే అని సాక్షాత్తూ నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే తెలిపారని, దీన్ని తొలగించాలని ఆయనే భావించారని రాంమాధవ్ గుర్తుచేశారు.

సాక్షాత్తూ నిండు సభలో నెహ్రూ విధానాలపై స్వైర విహారం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు మద్దతు పలికారు. కాశ్మీర్‌ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది అంటే దానికి ప్రధాన కారణం ఆనాటి నెహ్రూ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడిన మాటలు చారిత్రాక సత్యాలని ఆయన పేర్కొన్నారు. ఆనాడు నెహ్రూ అవలంబించిన విధానాలే నేడు ప్రత్యేక జమ్మూ కశ్మీర్ కావాలన్న డిమాండ్‌కు పురుడు పోసుకున్నాయని ఘాటుగా స్పందించారు.

జమ్మూలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్సే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ సమస్యలకు బీజేపీ- పీడీపీ పొత్తే ప్రధాన కారణమన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను రామ్ మాధవ్ కొట్టిపారేశారు. మా పొత్తు కొనసాగింది కేవలం రెండున్నర ఏళ్లు మాత్రమేనని, అదే కాంగ్రెస్ పాలన కొన్ని దశాబ్దాలకు సాగిందని, అందుకే కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.