ఎబివిపి కార్యకర్తలకు ముసుగులు... పోలీసులపై ఆగ్రహం

ఎబివిపి ఏపీలో శుక్రవారం జరిపిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ సందర్భంగా విజయనగరంలో  ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, ముఖాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశ పెట్టడం పట్ల ఎబివిపి, బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టిన ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేయడమే కాకుండా ముసుగులు వేయడం, కోర్టుకు తరలించడాన్ని ఎబివిపి నేతలు ఖండించారు.

రాష్ట్ర డిజిపి స్పందించి ఎస్పీ, డీఎస్పీ లను సస్పెండ్‌ చేయాలని ... ఎబివిపి కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ని డిఎస్పీ లను వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎబివిపి కార్యకర్తలు, బిజెపి నేతలు శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో లో బైఠాయించి నిరసనకు దిగారు. ఎస్పీ వెంటనే రావాలని, ఎస్పీ ని వెంటనే విధుల నుండి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

ఎస్పీ డౌన్‌ డౌన్‌ అంటూ ... ఎబివిపి కార్యకర్తలు, బిజెపి నేతలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా బిజెపి నేతలు ఎబివిపి కార్యకర్తలు ఎస్పీ కార్యాలయం లోనికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు ఎబివిపి కార్యకర్తలను, బిజెపి నేతలను వాహనాల్లో ఎక్కించి ఎస్పీ కార్యాలయం నుండి తరలించారు

ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలును ఉగ్రవాదులాగా, వీధి రౌడీల్లాగా పోల్చుకొని ఊహించుకొని తన చిల్లర ప్రచారం కోసం అమానుషంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రావణ్ తక్షణం సస్పెండ్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇలాంటి సంఘటనలుతో పోలీసు అధికారుల వ్యవహార శైలివలన పోలీసు వ్యవస్థను సమాజం గౌరవించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని సమావేశం పెట్టిన వారం తిరిగేలోపు విజయనగరంలో విద్యార్థి నాయకులపట్ల ఈరకంగా వ్యవహరించడం సిగ్గుచేటని బిజెపి ఏపీ శాఖ తీవ్రంగా ఖండించింది.