కృష్ణకు గోదావరి నీళ్లు.... సిఎంలు సుముఖం

కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో గోదావరి వరద నీటిని రోజుకు 4 టీఎంసీల చొప్పున కృష్ణాకు మళ్లించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇందుకు తగిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం ప్రాంతం, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని మళ్లించాలని నిర్ణయించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిల తొలి అధికారిక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగింది. రెండు రాష్ట్రాలకు చెందిన 10 మంది మంత్రులు, సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఓ ప్రకటన విడుదలైంది.

దీని ప్రకారం.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూలకు సాగునీరు, తాగునీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశమ్రలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పని చేస్తాయని ప్రతినబూనారు. 

రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. నదీజలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మర్చిపోయి, మంచి మనసుతో రెండు రాష్ర్టాలకు ఎంత వీలయితే అంత మేలుచేసే విషయంలో రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు.

గోదావరి, కృష్ణానదుల్లో కలిపి నాలుగువేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ర్టాలను సుభిక్షం చేయవచ్చునని కేసీఆర్ అన్నారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున గోదావరి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఉభయ సీఎంలు ఆదేశించారు. జూలై 15లోగా ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు, నీటిపారుదల నిపుణులు ఒక కమిటీగా ఏర్పడి, అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ర్టాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. తెలుగు రాష్ర్టాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. తక్కువఖర్చుతో రెండు రాష్ర్టాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.

విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలన్నింటినీ సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవాలని ఈ సమావేశంలో రెండు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్చలు శనివారం కూడా కొనసాగుతాయి. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ర్టాల సీఎస్‌లను ఇద్దరు సీఎంలు ఆదేశించారు.