ఆర్థిక నేరగాళ్లకు ఊచలు లెక్కపెట్టిస్తాం : బిజెపి

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వంటి ఆర్థిక నేరస్థులను భారత్‌కు రప్పిస్తామని, వారిని ఉచాలు లేక్కపెట్టిస్తామని బిజెపి జాతీయ కార్యవర్గం హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సమావేశాలలో ఆమోదించిన ఆర్ధిక తీర్మానంలో హాంకాంగ్- యూకే మధ్య వారు చక్కర్లు కొడుతున్నప్పటికీ చివరికి తేలేది భారత జైళ్లలోనేనని బీజేపీ స్పష్టం చేసింది.

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్లు ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు. లండన్-హాంకాంగ్ మధ్య దర్జాగా విహరిస్తున్నారు. వీరందరినీ భారత్‌కు రప్పిస్తామని, భారత చట్టాల ప్రకారం శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అవినీతి ఓడ మునుగుతోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విమర్శించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం 11 శాతానికి పైగా ఉందని, మోదీ కారణంగా ఇప్పుడది 4 శాతానికి పడిపోయిందని తెలిపారు. మోదీ అధికారంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ దోపిడీ సాగదనే బంద్‌కు పిలుపునిచ్చారని ఆరోపించారు. అసలింతకీ బంద్‌కు ఎందుకు పిలుపు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చినందుకా? ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నందుకా? అని కాంగ్రెస్‌ను సూటిగా ప్రశ్నించారు.

 ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను నక్వీ గుర్తు చేస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎవరు కలిసున్నారో తెలుసుకోవాలని కోరారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పెట్టుకుంటే ఏమైంది? పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే ఏమైంది?’’ అని ప్రశ్నించారు. అంతర్జాతీయ, స్థానిక కారణాలతో ద్రవ్యోల్బణం పెరిగిన మాట వాస్తవమేనని, అయితే దానిని అదుపులో ఉంచవచ్చని నక్వీ వివరించారు.

బిజెపిను గద్దె దించి అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని కార్యవర్గం ఆమోదించిన రాజకీయ తీర్మానంలో బిజెపి ఎద్దేవా చేసింది. ప్రతిపక్షాలకు సరైన నాయకుడు కానీ, విధానం కానీ లేవని. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యంత ప్రజాదరణగల నేత అని స్పష్టం చేసింది. 2022 నాటికి ‘నవ భారతం’ నిర్మించాలన్న దృఢ సంకల్పాన్ని ఈ తీర్మానం మరోసారి స్పష్టంగా వివరించింది. బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని దుయ్యబట్టింది.

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కార్యవర్గం ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు వివరిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి దార్శనికత, దూరదృష్టి, తపన, ఆకాంక్షలు ఉన్నాయని తెలిపారు. నాలుగేళ్ళ నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలుసునని చెప్పారు. 2022నాటికి భారతదేశం ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం లేని దేశంగా రూపొందుతుందని చెప్పారు. 2022నాటికి ఇల్లు లేనివారిగా ఎవరూ ఉండరని తెలిపారు.