కశ్మీర్‌ సమస్యకు కారణం నెహ్రూ కాదా..?...అమిత్ షా నిప్పులు

‘జమ్ముకశ్మీర్‌లో మూడోవంతు భాగాన్ని కోల్పోయాం. అందుకు ఎవరు కారణం. నెహ్రూజీ కాదా?’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. 

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగింపుపై అమిత్‌ షా ఈ ఉదయం సభలో తీర్మానం ప్రవేశపెట్టా\గా, తీర్మానంపై కాంగ్రెస్‌ సహా విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి కశ్మీర్‌లో ఎన్నికలు వాయిదా వేసి రాష్ట్రపతి పాలన కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. మధ్యాహ్నం దీనిపై చర్చ జరగగా.. ప్రతిపక్షాల విమర్శలకు షా దీటుగా సమాధానమిచ్చారు. 

‘ఈ రోజు మనీశ్‌ తేవారి విభజన గురించి లేవనెత్తారు. ఆయనను నేడు ఒకే ప్రశ్న అడగాలనుకుంటున్నా. విభజనకు కారకులు ఎవరు? ఈ రోజు కశ్మీర్‌లో మూడోవంతు భాగం మన అధీనంలో లేదు. దానికి బాధ్యులు ఎవరు? నెహ్రూ కాదా..? ఒకప్పుడు కశ్మీర్‌లో భారత్‌ అనే పేరు కూడా కన్పించేది కాదు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైన్‌బోర్డుపై ఇండియా అనే పదం కన్పించకుండా వస్త్రం కట్టేవారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది' అని ప్రహనించారు. 

1953లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కశ్మీర్‌కు వెళ్లి ఇద్దరు ప్రధానులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందుకు ఆయనను జైలుకు పంపారు. ఆయన మృతిపై కూడా దర్యాప్తు చేపట్టలేదు. ఎందుకు? ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్‌ నుంచి మేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ’ అని అమిత్ షా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 

‘ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అందులో 93సార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్‌ ఎన్నోసార్లు రాష్ట్రపతి పాలన తీసుకొచ్చింది. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల దృష్ట్యా మేం రాష్ట్రపతి పాలన కోరితే అందుకు వ్యతిరేకిస్తోంది’ అని ఎద్దేవాచేశారు. 

భద్రతా కారణాల రీత్యా జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగిస్తున్నామని, అమర్‌నాథ్‌ యాత్ర తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అమిత్ షా భరోసా ఇచ్చారు. 

జమ్ముకశ్మీర్‌ ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సరిహద్దుల్లో రక్షణను బలోపేతం చేసి, ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించడమే తమ బిజెపి సిద్ధాంతమని షా చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో భద్రత కోసం కేంద్రం ఇప్పటికే రూ.2,307కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. 

చర్చ అనంతరం జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జులై 3 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండనుంది. దీంతో పాటు జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది.