మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదమే

ఉగ్రవాదంతోనే ప్రపంచంలోని మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. తీవ్రవాదం, జాత్యహంకారాలకు ఊతమిచ్చే అన్ని మాధ్యమాలకు చెక్ పెట్టేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్‌లో ఇవాళ జరిగిన బ్రిక్స్ దేశాల అనధికార సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.

ప్రస్తుతం ప్రపంచానికి ప్రధానంగా మూడు సమస్యలు సవాలుగా మారాయని ప్రధాని చెప్పారు.  ‘‘ఆర్ధిక మందగమనం, అస్థిరత, తీవ్రవాదం .. ఈ మూడు ప్రధాన సవాళ్లపై నేను మాట్లాడదల్చుకున్నాను. మానవాళికి తీవ్రవాదం కారణంగా పెనుముప్పు పొంచిఉంది. ఇది అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాదు... అర్ధికాభివృద్ధి, మత సామరస్యాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తీవ్రవాదం, జాత్యాహంకారాలకు మద్దతిస్తున్న అన్ని మాధ్యమాలను నిలువరించాలి..’’ అని ప్రధాని పేర్కొన్నారు.

వీటిని ఎదుర్కోవడానికి ఐదు పరిష్కారాలను కూడా ప్రధాని బ్రిక్స్ దేశాల ముందు ఉంచారు. ఆర్ధిక, వ్యాపార సంస్థల్లో సంస్కరణలు తీసుకు రావడం... గ్యాస్, ఆయిల్ తక్కువ ధరకే లభ్యమయ్యేలా చూడడం... భౌతిక, సాంఘిక మౌళిక వసతులతో పాటు సభ్య దేశాల పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలను మోదీ లేవనెత్తారు.

కాగా ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తదితరులు హాజరయ్యారు.

స్వరం మార్చిన ట్రంప్

ఇలా ఉండగా, అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులు ‘‘ఆమోదయోగ్యం కాదనీ’’... వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్వరం మార్చారు. జీ20 సమ్మేళనం సందర్భంగా ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మెత్తబడ్డారు. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆయన అంగీకరించారు.

ఇటీవల అమెరికా వైఖరికి ప్రతిగా ఇటీవల భారత్ విధించిన పన్నులపై గురువారం ట్రంప్ స్పందిస్తూ.. ‘‘‘భారత్ అనేక ఏళ్లుగా అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అత్యధిక సుంకాల గురించి ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలే ఈ పన్నులు మరింత పెంచారు. ఆమోదయోగ్యం కాని ఈ పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

అయితే ఇవాళ ఉదయం జరిగిన చర్చల సందర్భంగా ఇరు దేశాధినేతలు వాణిజ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ట్రంప్, మోదీ సమావేశం అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోర్ఖలే స్పందిస్తూ... ‘‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)ని రద్దు చేసిన తర్వాత తాము కొన్ని చర్యలు తీసుకున్నట్టు ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇప్పటికే అది అమల్లోకి వచ్చిందనీ... ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలన్న దానిపై పరిశీలన చేస్తామని తెలిపారు. ఈ ఆలోచనను ట్రంప్ స్వాగతించారు...’’ అని పేర్కొన్నారు.

మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న 14వ జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఈ ముగ్గురు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు.