భారత ఆర్థిక వ్యవస్థలో జపాన్ పాత్ర ఎంతో ముఖ్యం

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని,  భారత్, జపాన్ మధ్య సంబంధాలు ఎంతో బలమైనవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కార్ల తయారీ కోసం ఉభయ దేశాల మధ్య మొదలైన సహకారం నేడు బుల్లెట్ రైళ్లను ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నదని తెలిపారు. 

జీ20 సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వచ్చిన మోదీ కోబ్ నగరంలో భారత సంతతికి చెందిన ప్రజలతో మాట్లాడుతూ ఉభయ దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాల పురాతనమైనవని గుర్తు చేశారు. ఒకరి సంస్కృతి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉందన్నారు. భారత జాతిపిత ప్రాచుర్యం లోకి తెచ్చిన మూడుకోతుల సిద్ధాంతం కూడా జపాన్‌కు సంబంధించినదేనని గర్తుచేశారు. 

వచ్చే ఐదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో జపాన్‌తో భారత్ సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయని చెప్పారు. భారత్‌లో నేడు జపాన్ ముద్రలేని ప్రాజెక్టులు లేవని అన్నారు. భారతీయుల నైపుణ్యం, కార్మిక శక్తి జపాన్ బలోపేతం కావడానికి దోహదపడుతున్నాయని చెప్పారు. 

జపాన్‌తో భారత సంబంధాలు బలోపేతం కావడానికి స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ టాగోర్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, జస్టిస్ రాధాబినోద్ పాల్ తదితరులు కృషిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజోఅబేపై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సంతతి ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నందుకు వారికి మోదీ ధన్యవాదాలు తెలిపారు.   

ప్రధాని మోదీ గురువారం జపాన్ ప్రధాని షింజో అబేతో వివిధ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక స్థితి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల అప్పగింత, విపత్తు నిరోధక చర్యలు వంటి అంశాలు వారి చర్చల్లో చోటు చేసుకున్నాయి. వచ్చే అక్టోబర్‌లో జరుగనున్న జపాన్ చక్రవర్తి నారుహితో పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి కోవింద్ హాజరవుతారని ప్రధాని మోదీ చెప్పారు. జపాన్‌లో రెయివా శకం ప్రారంభమైన అనంతరం, మోదీ రెండోసారి ప్రధాని పదవిని చేపట్టిన తరువాత అబేతో సమావేశం కావడం ఇదే మొదటిసారి.