పొత్తులకై వేగంగా అడుగులేస్తున్న టిటిడిపి

తెలంగాణాలో పొత్తుల విషయంలో స్థానిక నాయకత్వానికి పార్టీ అధినేత చంద్రబాబు స్వేచ్చ ఇవ్వడం, కాంగ్రెస్‌తో పొత్తు తప్పదని స్థానిక నాయకులు నిర్ధారణకు రావడంతో ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నారు.  పొత్తుల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. సోమవారం సాయంత్రం ఉత్తమ్‌తో కూడా సమావేశం కానున్నారు.

మరోవంక పొత్తులపై చర్చలకు రావాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆహ్వానించారు. సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. మంగళవారం జరిగే అఖిలపక్ష సమావేశం సమావేశం తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు.