బీజేపీలో తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలు

తెలంగాణకు చెందిన పలువురు టిడిపి, కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరారు. టిడిపి సీనియర్‌ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్‌, చాడ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, షేక్‌ రహ్మతుల్లా కమలం తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ వీరందరికీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను అందజేశారు. జులై రెండో వారంలో టిడిపికి చెందిన కొన్ని జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతల చేరికలు ఉండనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. 

తెలంగాణలో బీజేపీ తిరుగులేని రాజకీయశక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు.  కేసీఆర్‌ నియంతృత్వం భరించలేకే బీజేపీకి వలసలు అని చెప్పారు. ఇది ట్రైలర్‌ మాత్రమేనన్నారు. అసలు సినిమా ముందుందని స్పష్టం చేశారు. 

కొత్త భవనాలంటూ కేసీఆర్‌ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే సచివాలయం, అసెంబ్లీ నిర్మాణమని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని,  ఒక్కో వ్యక్తిపై తలసరి అప్పు రూ.40వేల వరకు ఉందని ధ్వజమెత్తారు. ఇంకా 40 నుంచి 50 ఏళ్లు కొనసాగే అవకాశమున్న సచివాలయ భవనాలను కూల్చడాన్ని లక్ష్మణ్‌ తప్పుబట్టారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సమయంలో కొత్తగా రూ.600 కోట్ల వ్యయంతో నూతన భవనాలు నిర్మించడాన్ని ఆయన ఆక్షేపించారు. 

తెలంగాణలో బిజెపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బెంగాల్‌ తరహా రాజకీయాలకు తెరలేపిన సీఎం కేసీఆర్‌కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.  టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతోందని చెప్పారు.