పాక్‌ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ

పాకిస్థాన్‌ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్‌ అల్వీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన అల్వీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఎటువంటి హడావిడి లేకుండానే ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి నివాసంలో చీఫ్‌ జస్టిస్‌ సాక్విబ్‌ నిషార్‌ అల్వీతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు.

శనివారం నాటికి అధ్యక్షుడిగా మమ్నూన్‌ హుస్సేన్‌ పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష భవనాన్ని ఖాళీచేసి వెళ్లారు. అల్వీ ప్రమాణస్వీకారోత్సవానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖుమర్‌ జావేద్‌ బజ్వాతో పాటు ఇతర ముఖ్య సైన్యాధికారులు హాజరయ్యారు.

తాజాగా దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి ఐత్‌జాజ్‌ అహసన్‌, ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌’ అభ్యర్థి మౌలానా ఫజల్‌ ఉర్‌ రహమాన్‌లను అల్వీ ఓడించారు. అల్వీ 1969 నుంచి విద్యార్థినేతగా ఉన్నారు. 1979లో జమాత్‌-ఎ-ఇస్లామీ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించినప్పటికీ ఆ సమయంలో ఎన్నికలు జరగలేదు.

2006 నుంచి 2013 వరకూ ఆయన పీటీఐ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఈ ఏడాది జులై 25న పాక్‌లో జరిగిన ఎన్నికల్లో కరాచీ నుంచి గెలుపొందారు. 2013లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆల్వీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇమ్రాన్‌ తన అజెండాను నెమ్మదిగా అమలుపరుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.