మోదీకి ఓట్లేసిన వారికి సాయమా.. కుమారస్వామి అసహనం

సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపిన ప్రజలపై కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి సహనం కోల్పోయి మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన గ్రామ బస కార్యక్రమంలో పాల్గొనేందుకు కారెగుడ్డ గ్రామానికి బస్సులో వెళుతున్న కుమారస్వామిని రాయ్‌చూర్ జిల్లాలో కొందరు అడ్డుకున్నారు. నినాదాలు చేశారు. దీంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.

బస్సు కిటికిలో నుంచి చూస్తూ.. ఆందోళనకారులపై చిటపటలాడారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటేసిన మీకు సాయం చేయాలా? అని ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్‌ను స్థానిక టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశించి కుమారస్వామి మాట్లాడుతూ.. మిమ్మల్ని నేను గౌరవించాలా? మీ మీద లాఠీచార్జి చేయించాలా? మీరు మోదీకి ఓటేశారు. మళ్లీ మీరు సాయం చేయమని నన్ను అడుగుతున్నారు అంటూ నిష్టూరంగా మాట్లాడారు. 

ఆందోళనకారులు నిరసన కొనసాగించడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తప్పించారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కుమారస్వామి ప్రతిస్పందించిన తీరు ఆయన ఆవేశం, నిరాశా నిస్పృహలను తెలియజేస్తున్నదని పేర్కొంది. సామాన్యుడి మాదిరిగా సీఎం ఆవేశపడడం మంచిది కాదని, సీఎంగా కొనసాగడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడం మంచిదని సూచించింది.