2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం

2023 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని   మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌  విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు కాలం చెల్లిందన్న ఆయన.. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు.    

హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొంటూ కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారని చెప్పారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో 20శాతం ఓట్లు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటోందని తెలిపారు.  బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కశ్మీర్ రాష్ట్రాల్లలో అధికారమే లక్ష్యంగా పనిచేయబోతున్నామని చౌహాన్ స్పష్టం చేశారు. 

బీజేపీ సభ్యత్వ జాతీయ ప్రముఖ్ హోదాలో తొలిసారి తెలంగాణకు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెబుతూ తాను 15 ఏళ్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఏ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూడలేదని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. 

నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లుంటే తెలంగాణ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఒక్క కేంద్ర పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదని ఆరోపించారు.  తెలంగాణలో బీజేపీని వేగంగా బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. జులై 6న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. 

దేశంలోని అన్ని వర్గాలను సభ్యత్వంలో భాగస్వాములను చేస్తామన్నారు. కళాకారులు, క్రీడాకారులను సైతం బీజేపీ కుటుంబంలో భాగస్వాములను చేస్తామని చెబుతూ తెలంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సభ్యత్వ ప్రక్రియ చేపడతామని చౌహాన్ తెలిపారు. క్షేత్రస్థాయిలోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ విధానలను తీసుకెళ్తామన్నారు. కేసీఆర్ పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.