‘రా’ చీఫ్‌గా బాలాకోట్‌ వ్యూహకర్త సామంత్‌ !

 కీలక భద్రతా విభాగాలకు చీఫ్‌లను నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక విభాగమైన ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌’ (రా)కి సామంత్‌ గోయెల్‌ని ఛీప్‌గా నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)కి అరవింద్‌ కుమార్‌ని డైరెక్టర్‌గా నియమించారు. 

ఈ ఇద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. గోయెల్‌ పంజాబ్‌ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్‌ కుమార్‌ అసొం-మేఘాలయ కేడర్‌లో పనిచేశారు.  ఇప్పటివరకు సామంత్‌ గోయెల్‌ నిఘా వర్గాల ఆపరేషన్స్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 

అలాగే గత ఫిబ్రవరిలో బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరించారు. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌కు మంచి పేరుంది. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా ఈయనకు మంచి అవగాహన ఉంది. 

ఐబీ చీఫ్‌గా ఎన్నికైన అరవింద్‌ కుమార్‌ వామపక్ష తీవ్రవాదాన్ని నిరోధించడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఐబీ కశ్మీర్‌ విభాగంలో ప్రత్యేక సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోయలో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు.