రాజ్యసభలో సొంత మెజారిటీ చేరువలో ఎన్డీయే!

లోక్‌సభలో భారీ ఆధిక్యం ఉన్నా రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేకపోవటంతో కీలకమైన బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో ఆ సమస్యను అధిగమించనుంది. జులై 5వ తేదీ తర్వాత సాధారణ మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలానికి చేరువకానుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం రాజ్యసభలో తన సంఖ్యా బలాన్ని బిజెపి క్రమంగా పెంచుకొంటోంది.

టిడిపి రాజ్యసభ సభ్యులు నలుగురు బిజెపిలో చేరికతో ఆ పార్టీ బలం ప్రస్తుతం 74కు చేరింది. జులై 5న ఎన్నికలు జరగనున్న రాజ్యసభ 6 సీట్లలో నాలుగింటిని బిజెపి అవలీలగా గెలుచుకోనుంది. దీంతో ఎగువసభలో ఒక్క బిజెపి బలమే 78కి చేరుకోనుంది.  ఐఎన్‌ఎల్‌డీ ఏకైక సభ్యుడు రాంకుమార్‌ కశ్యప్‌ కూడా బిజెపిలో విలీనాన్ని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి లేఖ ఇచ్చారు. కేరళ కాంగ్రెస్‌(మణి)కి చెందిన ఏకైక రాజ్యసభ సభ్యుడు జోస్‌ కె.మణి బిజెపితో సన్నిహితంగా ఉంటున్నారు. 

ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలనూ కలిపితే 109 మంది సభ్యులు అధికారపక్షానికి ఉంటారు. 
స్వతంత్రులు (6), నామినేటెడ్‌ సభ్యులు (నలుగురు) సాధారణంగానే అధికార పక్షానికి సహకరిస్తుంటారు.   మొత్తం 245 మంది సభ్యులుండే రాజ్యసభలో సాధారణ మెజార్టీ అయిన 123కి చేరుకోవటానికి మరో నలుగురు సభ్యులు అవసరం. బీజేడీ,  టీఆర్ఎస్, వైసిపి వంటి స్నేహపూర్వక ప్రతిపక్షాలూ (మూడు పార్టీలకు కలిపి 13 మంది సభ్యులున్నారు) అంశాల వారీగా మద్దతిస్తుంటాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైనవని భావించే బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందటం సులభవమవుతుందని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, వివాదాస్పదమైన ముమ్మారు తలాక్‌ బిల్లు మ్రాతం భిన్నమైనది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ దీనిని వ్యతిరేకిస్తోంది. ఆ ఒక్కటి మినహా మిగతా బిల్లుల విషయంలో రాజ్యసభలో తమకు ఇక సమస్య ఉండదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి బహిష్కరణకు గురైన అమర్‌సింగ్‌ కూడా సభలో బిజెపికే సహకరించవచ్చని భావిస్తున్నారు. 

జులై5న ఎన్నికలు జరిగే రాజ్యసభ ఆరు సీట్లలో మూడు ఒడిశాకు చెందినవే. బీజేడీ ఆ మూడు స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలదు. అయినప్పటికీ ఒక స్థానాన్ని విపక్ష బిజెపికి ఇవ్వటానికి బీజేడీ అంగీకరించిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ప్రతిగా లోక్‌సభలో తమ పార్టీ సీనియర్‌ సభ్యుడైన భతృహరి మహతాబ్‌కు ఉప సభాపతి పదవిని భాజపా వాగ్దానం చేసిందని చెబుతున్నారు.