లోక్‌సభలో కాంగ్రెస్ ఒక పంచింగ్ బ్యాగ్

‘లోక్‌సభలో కాంగ్రెస్ ఒక పంచింగ్ బ్యాగ్’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనదే అని మోడీ ప్రభుత్వం చెప్పుకొనే ప్రయత్నం చేస్తోందని, తనకు ముందు పాలించిన వారిని చులకన చేస్తోందన్న విమర్శను ఆయన తిప్పికొట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ …బలమైన, సురక్షితమైన, అభివృద్ధికరమైన, సమగ్రమైన దేశం కావాలన్న కల నిజం కావాలంటే అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మోడీ సమాధానమిస్తూ మాజీ ప్రధానులు వాజ్‌పేయి, పివి నరసింహారావు చేసిన మంచిపనుల గురించి కాంగ్రె స్ ఎన్నడూ చెప్పలేదని విమర్శించారు. ‘కేవలం కొందరు మాత్రమే దేశాభివృద్ధిలో కీలకమని కొందరు అనుకుంటారు. వారి పేర్లనే ఎప్పుడూ వినాలనుకుంటారు. మిగతావారిని విస్మరిస్తారు. మనం అందుకు భిన్నంగా ఆలోచించాలి. దేశ పురోభివృద్ధికి ప్రతి పౌరుడూ కృషి చేస్తున్నాడు అనుకోవాలి ’ అని ప్రధాని చెప్పారు.


‘దేశాభివృద్ధిలో కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉందని ఎర్రకోట నుంచి చెప్పిన ప్రధానిని బహుశ నేనొక్కడినే కావచ్చు. అదే మాట ఈ సభలో కూడా చెప్పాను’ అని ప్రధాని మోడీ తెలిపారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అతల్ బిహారీ వాజ్‌పాయి వంటి ఇతర పార్టీల నాయకులు చేసిన సేవల్ని, విజయాలను విస్మరించడమే కాక, అవి తనవిగా పేర్కొందని ధ్వజమెత్తారు. 

పైగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాల గురించి చెప్పేటప్పుడు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల పేర్లు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ‘నరసింహారావు జీ చేసిన మంచిపని గురించి వాళ్లు ఎప్పుడైనా మాట్లాడారా? లోక్‌సభ చర్చల్లో ఈ నాయకులే మన్మోహన్‌సింగ్ గురించికూడా మాట్లాడరు. ఎందుకంటే… ఆ కుటుంబానికి చెందని వారికి ఎలాంటి ఘనత, గౌరవం దక్కవు’ అని మోడీ ఆరోపించారు. 

నిజానికి తను ఇలాంటివి చెప్పడం తనకు ఇష్టం లేదని, కానీ తను వారి ఘనతను కొట్టేశానని తనను కాంగ్రెస్ నాయకులు అదేపనిగా విమర్శించారు కాబట్టి ఇలా చెప్పాల్సి వచ్చిందని, ‘జరిగింది చాలు…ఇకపై ఇలాంటి ప్రచారాలు మానుకోండి’ అని కాంగ్రెస్‌ను హెచ్చరించా రు. గత ప్రభుత్వాలను తక్కువ చేసేందుకు ఎన్‌డిఏ ప్రయత్నించిందన్న విమర్శను కూడా ప్రధాని తిరస్కరించారు. తన ముందు వారికంటే మంచి పనితీరును కనబరిచినందువల్లే తన ప్రభుత్వం ప్రజాదరణ పొందిందని మోడీ ఉద్ఘాటించారు. 

ప్రజలతో సంబంధాల్ని పోగొట్టుకోవడంలో, వాస్తవాలకు దూరంగా ఉండడంలో కాంగ్రె స్ నాయకులు ఎంతో ఎత్తుకు ఎదిగారని వ్యంగ్యం గా అన్నారు. 2014లో ప్రజలు ఎన్‌డిఏ కు ఒక అవకాశం ఇచ్చారంటే యుపిఎ నుంచి తప్పించుకునేందుకు అదొక మార్గమని భావించి ఇచ్చారని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ‘ఎన్నిక ల్లో గెలుపు ఓటములకు అతీతంగా నేను ఆలోచిస్తాను. దేశప్రజల సంక్షేమంకోసమే పాటుపడతాను. 130కోట్ల మంది భారతీయలకు సేవచేసే భాగ్యం కలగడమే నాకు తృప్లినిస్తుంద’న్నారు. 

భారతదేశ ఆత్మను పిండేసిన ఘటనగా మోడీ ఎమర్జెన్సీ ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోడీ.. రాహుల్, సోనియాగాంధీలపై తప్పుడు ఆరోపణ లు చేశారని, ఒకవేళ వారు దోషులైతే జైల్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. అందుకు మోడీ సమాధానమి స్తూ ‘వాళ్లను (రాహుల్, సోనియా) జైల్లో పెట్టలేదని మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మనం ఎమర్జెన్సీ కాలంలో లేము. మేము చట్టాన్ని అనుసరిస్తాం. మీరు జైలు బయట ఉన్నందుకు సంతోషించండి. దేశం నుంచి మనం ఎంతో పొందాము. మంచిమార్గం నుంచి దారిమళ్లాల్సిన అవసరం లేదు’ అన్నారు.