ప్రజావేదిక భవనం కూల్చివేత

ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతను అధికారులు మంగళవారం సాయంత్రం చేపట్టారు.  ప్రజావేదిక భవనాన్ని గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున కూల్చివేస్తామని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆ నేపథ్యంలో మంగళవారం సదస్సు ముగిసిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు. 

కృష్ణానది కరకట్టపై సుమారు రూ.9 కోట్లతో ఈ భవనాన్ని చంద్రబాబు హయాంలో సీఆర్డీయే నిర్మించింది. ఇది అక్రమ నిర్మాణమని, అక్ర మ నిర్మాణాల కూల్చివేత దీనితోనే ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు మంగళవారం సాయంత్రం దీని కూల్చివేత ప్రారంభించారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన అనంతరం ప్రజావేదికవద్దకు చేరుకున్న సీఆర్డీయే అధికారులు.. భవనంలోని ఫర్నిచర్, ఏసీలు, మైకులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను సచివాలయం గోదాంలోకి తరలించారు.   

 కాగా, కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అలాకాకుండా ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్రజావేదికను ప్రజల అవసరాలకే వినియోగించాలని సూచించారు. 

ప్రజావేదిక భవనాన్ని కూల్చివేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ల సదస్సు వంటి అధికారిక సమావేశాల నిర్వహణకు తాడేపల్లిలో ఒక భవనాన్ని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.  కృష్ణా నది కరకట్ట లోపలి భాగంలో నిర్మించిన ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొదలు పెడతున్నామని, ఆ తర్వాత ఉండవల్లి కరకట్ట రోడ్డును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలనూ తొలగిస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఎస్పీల సమావేశంలో ప్రకటించారు.

 ‘మొన్నటి వరకూ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ పక్కనే ఉన్న అక్రమ భవనంలో నివాసముంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఆయనే మరో అక్రమ భవనాన్ని నిర్మింపజేశారు. ముఖ్యమంత్రో, కలెక్టరో, ఎస్పీయో అని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడం సరైనదేనా? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారే తప్పు చేసినప్పుడు ఇతరులను ప్రశ్నించే నైతికత ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభిస్తాం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఇదో సంకేతంగా నిలవాలి. జిల్లాల్లోనూ మీరు ఇదే తరహాలో వ్యవహరించాలి’ అని ఎస్పీలకు సీఎం సూచించారు.

ఇలా ఉండగా, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న ఆయన.. ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు చెప్పారు. సాధ్యపడే విషయమైతే అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ రూపంలో కేంద్రం ఎందుకిస్తుంది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మోసం చేయకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.