జులై 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

జులై నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. 11వ తేదీ దశమి మంచి రోజు కావడంతో ఆ రోజు సమావేశాలను ప్రారంభించాలని, 12వ తేదీన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకే పెట్టపీట వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపైగా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికీ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయనున్నారు.

ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం రెండో ఏడాది నుంచి అందిస్తామని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది రబీ నుంచే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అక్టోబర్‌ 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 

అలాగే బడ్జెట్‌లో రైతులకు సున్నా వడ్డీకే రుణాలకు, అలాగే పంటల బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బడ్జెట్‌పై వచ్చే నెల 1, 2వ తేదీల్లో అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సమావేశం కానున్నారు.