బీజేపీలో చేరబోతున్నా .... కోమటిరెడ్డి

టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగాబిజెపిలో చేరాలని నిశ్చయించుకున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని.. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని ఢిల్లీలో ప్రకటించారు. 

బిజెపి నుంచి తనకు ఆహ్వానం అందిందని, రెండుసార్లు రాం మాధవ్‌తోనూ చర్చించానని వెల్లడించారు. నూటికి నూరు శాతం తాను పార్టీ మారడం ఖాయమని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్  కు బిజెపినే ప్రత్యామ్నాయమని 10 రోజుల క్రితమే తాను చెప్పానని.. నేడూ అదే చెబుతున్నానని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా పొరపాట్ల వల్లే తెలంగాణలో రెండోసారీ అధికారం కోల్పోయామని విమర్శించారు. 

రాష్ట్రంలో భవిష్యత్తులో బిజెపి బలపడే అవకాశం ఉందని చెప్పారు. దేశంలోని యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని తెలిపారు. తమకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే  టీఆర్ఎస్   పిలిచినప్పుడే వెళ్లేవాళ్లమని చెప్పారు. స్వార్థంతో కాకుండా.. దూరదృష్టితో ఆలోచించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. 

రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తాను కాకుండా మరెవరు పార్టీ పగ్గాలు చేపట్టినా మార్పు ఉండదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు తనను నమ్మి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వెలిబుచ్చారు.   

ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనకు షోకాజ్ నోటీసులు పంపడంపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ‘‘ప్రతిపక్ష హోదాను కూడా కాపాడలేని వాళ్లు నాకు నోటీసులు ఇవ్వడం ఏంటి?’’ అని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ ఘోర పరాజయాలు ఎదుర్కొన్నా.. కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ను మార్చకపోవడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కళ్లే అని పేర్కొన్నారు. 

ఇదే సమయంలో తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందించిన ఆయన.. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం ప్రకారం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మార్పు విషయంలో తన సోదరుడి వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు.